పసుపు బోర్డు విషయంలో మాట తప్పిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అడుగడుగునా నిరసన సెగలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో కొర్రీలు పెట్టిన కేంద్రం తీరును నిరసిస్తూ రైతులు గత నెలలో పెర్కిట్‌లోని ఆయన ఇంటి ఎదుట వడ్లు పారబోసి రైతులు ఆందోళనకు దిగారు. తాజాగా ఆదివారం పసుపు కొమ్ములను కుప్పగా పోసి పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానంటూ అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్మూర్, మే 8 : పసుపు బోర్డు ఏర్పాటు చేసే వరకూ ఉద్యమిస్తామని రైతులు స్పష్టం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోసం చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను జిల్లా ఎక్కడికెళ్లినా అడ్డుకుంటామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మండలం కోటార్మూర్‌లోని విశాఖ కాలనీలో ఎంపీ అర్వింద్ ఇంటిముందు ఆదివారం పసుపు కొమ్ములు పోసి నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో రైతులకు రాసిచ్చిన బాండ్ పేపర్ ప్రకారం పసుపు బోర్డును ఎంపీ అర్వింద్ ఏర్పాటు చేయించాల్సిందేనంటూ పెద్ద ఎత్తున పసుపు రైతులు డిమాండ్ చేశారు.
ఎంపీ అర్వింద్ పసుపు రైతులకు చేసిన ద్రోహాన్ని ఆర్టీఐ సమాచారం ద్వారా ఎమ్మెల్సీ కవిత ఇటీవల బట్టబయలు చేశారన్నారు. జిల్లాలో అర్వింద్ ఎక్కడికి వెళ్లినా పసుపు రైతులందరం ఆయనను అడ్డుకుని నిరసన తెలియజేస్తామన్నారు. ఎంపీ అర్వింద్ రైతుల గుండెల్లో బుల్లెట్లు దించుతామనడం భావ్యం కాదన్నారు. ఆయన గుండెల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు బుల్లెట్లు దించుతామని హెచ్చరించారు. ఆర్మూర్ ప్రాంత రైతులతో గతంలో పెట్టుకున్న కాంగ్రెస్ కనుమరుగై పోయిందన్నారు.
పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి నిండా ముంచిన అర్వింద్‌కు రాజకీయ సమాధి రైతుల చేతుల్లోనే ఉండనున్నదని అన్నారు. ఆర్మూర్ ప్రాంత రైతులకు బుల్లెట్లు కొత్త కాదన్నారు. గతంలోనే ఎర్రజొన్న ఉద్యమంలో ఆర్మూర్ ప్రాంత రైతులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బుల్లెట్లు దించిన చరిత్ర అర్వింద్‌కు గుర్తులేదా అని ప్రశ్నించారు. అప్పట్లో ఆయన తండ్రి కాంగ్రెస్‌లోనే ఉన్నారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయని పక్షంలో అర్వింద్ తన పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమించాలని సూచించారు. ప్రజల మద్దతు తీసుకుని గ్రామాల్లో తిరుగాలని, రైతులు, ప్రజలను మోసం చేసి సెక్యూరిటీతో తిరుగాలనుకోవడం అర్వింద్ భ్రమ అన్నారు. ఆందోళనలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన పసుపు రైతులు పాల్గొన్నారు.