కామారెడ్డి, మే 5: జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలకు ‘వేదిక’అందుబాటులోకి వచ్చింది. కామారెడ్డి మున్సిపల్ నిధులు రూ. 6 కోట్లతో నిర్మించిన కళాభారతి ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తిచేసుకోగా, శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొననున్నారు. ఉదయం 8 గంటలకు మంత్రి, విప్ ప్రారంభించనుండగా, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, మున్సిపల్ పాలకవర్గం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. కళాభారతి ఆడిటోరియంలో త్వరలోనే ప్రభుత్వ గంప గోవర్ధన్ ఉచిత కోచింగ్ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కళాభారతి ఆడిటోరియంలో 700 మందికిపైగా కూర్చునే అవకాశం ఉన్నది. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలకు ఈ ఆడిటోరియం అందుబాటులోకి రానున్నది.