ఆర్మూర్, జనవరి 27: ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో ఎంపీ అర్వింద్ ఎదుట నిరసన తెలిపింది పసుపు రైతులు కాదని.. టీఆర్ఎస్ నాయకుల పనేనంటూ రైతు ఐక్యవేదిక ప్రతినిధుల పేరిట వెలువడిన ప్రకటనల్లోని అసలు గుట్టు బయటపడింది. దాడిని ఖండించిన రైతు ఐక్యవేదిక ప్రతినిధుల అసలు రూపాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పల్లపు వెంకటేశ్ బట్టబయలు చేశారు. ఈమేరకు గురువారం తగిన ఆధారాలతో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్మూర్‌లో జరిగిన పసుపు రైతుల నిరసనను దాడిగా అభివర్ణించిన సంతోష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి బీజేపీ నాయకులని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు పంపించారు. రైతు ఐక్యవేదిక నాయకులమని, బీజేపీ రైతుల ముసుగులో రాజకీయం చేస్తున్నదని పల్లపు వెంకటేశ్ పేర్కొన్నారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పసుపు రైతుల ముసుగులో ఎవరు రాజకీయం చేస్తున్నారో తెలుసుకోవాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో రైతులకు హామీనిచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా చేస్తున్నదెవరో గ్రహించాలని సూచించారు. ఆర్మూర్ ప్రాంత రైతులతో రాజకీయం చేసింది ఎంపీ ధర్మపురి అర్విందా..? లేక ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డినా..? ఎవరో ప్రజలే గమనించాలని ప్రకటనలో పల్లపు వెంకటేశ్ పేర్కొన్నారు.