దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కులవృత్తుల వారిని బాగు చేసే పథకాలు దేశంలో కానీ, రాష్ట్రంలోగానీ రాలేదు. వారి గురించి పట్టించుకున్న ప్రజాప్రతినిధీ లేడు. దీంతో గ్రామాల్లో తమ వృత్తినే దైవంగా, వృత్తే జీవనాధారంగా నమ్ముకొని జీవిస్తున్న రజకులు, నాయీబ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్నివర్గాల అభివృద్ధి, బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ కులవృత్తులే జీవనాధారంగా కాలం వెల్లదీస్తున్న వారి బతుకుల్లో వెలుగులునింపుతున్నారు.
-ధర్పల్లి/ నిజాంసాగర్, సెప్టెంబర్ 12: తరతరాలుగా కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వారి జీవితాలు అంధకారం కావొద్దని, బడుగు జీవులకు విద్యుత్ సైతం భారంగా మారొద్దని, వారికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో లాండ్రీ షాపులు, ధోబీఘాట్లు నిర్వహించే రజకులకు, క్షౌరశాలలు(సెలూన్లు) నడిపే నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ మీటర్లు అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూతతో రజకుల రంది తీరింది. నాయీబ్రాహ్మణుల ముఖాల్లో నవ్వులు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు చేసిన కష్టమంతా ఖర్చులకు సరిపోయేది కానీ ఇప్పుడు సర్కారు ఇచ్చిన అండతో కొంత ఆదా చేసుకోగులుతున్నామని రజకులు, నాయీబ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బడుగుల జీవితాల్లో వెలుగులు..
కులవృత్తులు చేసుకునే వారిని ఇంత వరకు పట్టించుకున్న వారు లేరు. గ్రామాల్లో పూర్వ వైభవం తీసుకువచ్చి కుల వృత్తులు చేసుకునే వారి జీవితాల్లో సైతం వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నది. దీంట్లో భాగంగానే ఇది వరకే నేతన్నకు వెన్నుదన్నుగా నిలిచింది. యాదవులకు గొర్లు పంపిణీ చేసింది. గీత కార్మికులకు పింఛన్లు అందిస్తున్నది. రైతులకు రైతుబంధు, దళితులకు దళితబంధు తదితర పథకాలతో అన్నివర్గాలకూ అండగా నిలుస్తున్నది. ఇప్పుడు రజకులకు, నాయీబ్రాహ్మణులకు సైతం అండగా నిలవాలన్న లక్ష్యంతో ఉచిత మీటర్లు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
కామారెడ్డిలో 581 మంది దరఖాస్తు..
జిల్లాలో 22 మండలాలతోపాటు మున్సిపాలిటీల్లో కులవృత్తిని నమ్ముకున్న రజకులు, నాయీబ్రాహ్మణులు ఉన్నారు. లాండ్రీ, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 263లాండ్రీ దుకాణాలకు, 318 సెలూన్లకు అధికారులు కొత్త మీటర్లు మంజూరు చేశారు. దుకాణాలకు కమర్షియల్ (కేటగిరి-2) కింద కొత్త మీటర్లు, బోర్డు, స్విచ్‌లను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది. వాటిని బిగించే పనులకు సిబ్బంది శ్రీకారం చుట్టారు.
ఉచిత విద్యుత్ కోసం నిజామాబాద్‌లో 2137 దరఖాస్తులు..
సెలూన్లు, లాండ్రీ షాపులు, ధోబీఘాట్ నిర్వాహకులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ మీటర్లు అందజేస్తున్నది. ఈ పథకానికి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,137 దరఖాస్తులు రాగా 2,041మీటర్లు బిగించారు. అందులో సెలూన్ల నిర్వహణ కోసం 1,361, లాండ్రీ, ధోబీఘాట్ల నిర్వహణ కోసం 776 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నూతనంగా 1054 మీటర్లు బిగించగా, 987 పాత మీటర్లను ఉచిత విద్యుత్ మీటర్లుగా మార్చి ఇచ్చారు. 250 యూనిట్ల వరకు వీరికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. అయితే ప్రభుత్వం ఉచితంగా అందించే 250 యూనిట్లు సరిపోతుందని, ఇక తమకు కరెంటు కష్టాలు దూరమైనట్లేనని రజకులు,
నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చాలా సంతోషమనిపిస్తుంది..
సెలూన్ పని చేసుకొని బతికేటోళ్లం. అండ్ల ఇంక కరెంటు బిల్లు అంటే ఎంతో బాధ అయితుండె. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. చాలా సంతోషమనిపిస్తున్నది. సామాన్లకే సగం పైసల్ పోతుండె, మల్ల కరెంటు బిల్లు అంటే బాగా అయితుండె. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టే బాధ తగ్గింది. నాల్గు రూపాలు మిగులుతాయ్. గరీబోళ్ల కోసం ఆలోచిస్తూ అందరికీ అండగా నిలవడుతున్న గవర్నమెంటుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-కొరట్పల్లి అశోక్, సెలూన్ నిర్వాహకుడు, ధర్పల్లి
దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది
జిల్లాలో ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ మీ టర్ల కోసం 2137 దరఖాస్తులు వచ్చాయి. అవసరమైన వారికి నూతన మీటర్లు బిగిస్తున్నాం. కొత్త మీటర్లు అవసరం లేదన్న వారికి పాత మీటర్లనే ఉచిత మీటర్లుగా మార్పులు చేస్తున్నాం. ఉచిత మీటర్ల కోసం దరఖాస్తు చేసుకోవడం నిరంతర ప్రక్రియ. ఇప్పటికైనా మిగతా వారు దరఖాస్తు చేసుకుంటే మీటర్లను ఏర్పాటు చేస్తాం.
బిల్లు బాధలు తప్పినయ్..
లాండ్రీ షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న. పొద్దస్తమానం కష్టపడి ఇస్త్రీ చేస్తే వచ్చే పైసలు కూడా కరెంటు బిల్లుకే అయిపోతుండె. దీంతో ఈ బాధకన్న బొగ్గులు నయమని కొన్ని రోజులు బొగ్గుల ఇస్త్రీ పెట్టెతో చేసిన. ఇప్పుడు బొగ్గులు కూడా దొరకడం లేదు. దొరికినా అవ్వికూడా పిరమైనయ్. కేసీఆర్ సారు పుణ్యమా అని ఇస్త్రీ చేస్తే కరెంటు బిల్లు అత్తదన్న రందీ లేకుండా పోయింది. చేసుకున్న కాడికి నాల్గు రూపాలు మిగులుతాయ్. శానా సంతోషమవుతున్నది.
-సిర్నపల్లి పెద్ద గంగారాం, లాండ్రీ షాపు నిర్వాహకుడు, ధర్పల్లి.