రూరల్ నియోజకవర్గంలో 10 చెక్‌డ్యాములు
1,468 ఎకరాలకు సాగునీరు
హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు
కోట్లు వెచ్చించి నిజామాబాద్ జిల్లాలో 32 చెక్‌డ్యాముల నిర్మాణం గత ప్రభుత్వాలు దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, చెక్ డ్యాములు నిర్మిస్తూ తాగు, సాగునీటికి ఢోకా లేకుండా చేస్తున్నది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి వాగులు, వంకలు, కాలువలు ఉప్పొంగి ప్రవహించినా వేసవి వచ్చిందంటే తాగు, సాగునీటికి కటకటే. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టాలనుకున్న ప్రభుత్వం రాష్ట్రంలోని వాగులపై చెక్‌డ్యాములు నిర్మించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది.
ధర్పల్లి, సెప్టెంబర్ 5: హరితహారం కార్యక్రమ ఫలితమో, పరిస్థితుల అనుకూలతనో ఏటా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నప్పటికీ నీటి సంరక్షణ చర్యలు లేని కారణంగా మొత్తంలో నీరు వృథా అవుతున్నది. వృథాను అరికట్టి, ఆయకట్టు నీరందించేలా ప్రధానమైన ఆయా వాగులపై కోట్లు వెచ్చించి నూతనంగా చెక్ డ్యాముల నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుట్టింది. భూగర్భ జలమట్టం పెంచేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 32 చెక్ డ్యాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పది చోట్ల చెక్‌డ్యాములను నిర్మించి భూగర్భ జల వనరులు పెంపొందించి ఆయకట్టుకు సాగునీరందేలా చేసింది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో నియోజకవర్గంలో అత్యధికంగా పది చెక్ డ్యాములు నిర్మించడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
జిల్లాలో 32, రూరల్‌లో 10 చెక్‌డ్యాములు..
జిల్లాలో 32 చెక్‌డ్యాముల నిర్మాణం చేపట్టగా, ఎమ్మెల్యే కృషితో కేవలం రూరల్‌లోనే రూ.50కోట్ల 49లక్షలతో పది చెక్ డ్యాములు నిర్మించారు. దీంతో 1,468 ఎకరాలకు సాగునీరందడంతోపాటు భూగర్భ జలమట్టం పెరుగుతున్నది.
రూరల్‌ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
రూరల్‌ను అన్ని రంగాల అభివృద్ధితోపాటు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్నా. వాగుల ద్వారా ప్రవహించే నీరు వృథా కాకుండా జిల్లాలోనే పెద్ద మొత్తంలో కృషి చేసి పది చెక్‌డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.51కోట్ల వరకు మంజూరు చేయించి పనులు చేపట్టాం. దాదాపు సింహభాగం పనులన్నీ పూర్తయ్యాయి. చెక్‌డ్యాములు నిర్మించిన ప్రాంతాల్లో భూగర్భజలమట్టం పెరిగి బోర్లలో నీరు ఇంకిపోకుండా ఉంటుంది. వేల ఎకరాల్లో రెండు పంటలు సాగవుతాయి. రైతుల ఆనందమే లక్ష్యంగా ముందుకు సాగుతా.
-రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ఎమ్మెల్యే కృషితోనే..
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితోనే మా గ్రామంలోని వాగుపై చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. రూ.6.71కోట్లు మంజూరు చేయించి వాగుపై చెక్‌డ్యాం నిర్మించడంతో భూగర్భ జలమట్టం పెరిగి సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ఈ సంవత్సరం చెక్‌డ్యాం పూర్తిగా నిండి చెరువులా మారి నీరు ప్రవహించడం చాలా సంతోషమనిపించింది. ప్రజల తరఫున ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-కే.రమేశ్, సర్పంచ్, మైలారం.
బోర్లు ఫుల్లుగా పోస్తున్నాయి.
చెక్‌డ్యాంల నిర్మాణంతో బోర్లు ఫుల్‌గా పోస్తున్నాయి. చెక్‌డ్యాం పూర్తిగా నిండి చెరువులా మారింది. యాసంగి పంటలకు సైతం సాగునీటికి ఎలాంటి రంది లేదు. ఇంతకు ముందు వాగు పారితే జలకళ ఉంటుండే, కానీ ఇప్పుడు చెక్‌డ్యాం పై భాగమంతా జలకళతో ఉట్టిపడుతున్నది. చెక్‌డ్యాం నిర్మించిన ప్రభుత్వానికి, రూరల్ ఎమ్మెల్యేకు ప్రత్యేక దండాలు.