
ఆర్మూర్/మాక్లూర్/ నందిపేట, అక్టోబర్ 3 : సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ ఆడపడుచుల పండుగకు పూర్వ వైభవం తీసుకువచ్చి విశ్వవ్యాప్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వమేనని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్, నందిపేట మండల కేంద్రాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, బతుకమ్మ చీరలతోపాటు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మాక్లూర్‌లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావుతో కలిసి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన బతుకమ్మ పండుగను ప్రపంచానికి తెలియజేసి, పూర్వవైభవం తీసుకువచ్చింది తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని అన్నారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు పేదింటి ఆడబిడ్డలకు చీరలను అందజేస్తోందన్నారు. నిరుపేద ఆడబిడ్డలు సైతం పండుగను సంబురంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.