వేల్పూర్/మెండోరా/కమ్మర్పల్లి/ భీమ్‌గల్/ఏర్గట్ల, ఫిబ్రవరి 1: బీజేపీ, ప్రధాన మంత్రి మోదీ తెలంగాణకు ప్రధాన శత్రువులుగా మారారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణప్రాంతం ఎంతో వెనుకబడిపోయిందన్నారు. వేల్పూర్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, మెండోరా, భీమ్‌గల్ మండలాలకు చెందిన వందలాది మంది యువకులతోపాటు బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వనరులను దోచుకెళ్తుంటే భరించలేక కేసీఆర్ ఆనాడు తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. రాష్ర్టాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడంలేదని ఆరోపించారు.
దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం
దేశంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నిర్మించారని అన్నారు. కాళేశ్వరం ద్వారా ప్రతి గ్రామంలో నీటి వనరులు వృద్ధి చెందాయన్నారు. కాళేశ్వరం ఫలాలు కండ్లకు కనిపించడంతో ఓర్వలేక బీ జేపీ నాయకులు కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు ఓపిక పట్టామని, ఇక ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. ఎవరు ప్రశ్నిస్తే వారి పై కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ ద్వారా కేసులు నమో దు చేయిస్తోందని ఆరోపించారు.
విభజన చట్టంపై నిర్లక్ష్యం
రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీని బీజేపీ నిలుపుకోలేదన్నారు. రాష్ర్టానికి రావాల్సిన జీఎస్టీ రూ. మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. వివిధ రాష్ర్టాల్లో 150 మెడికల్ కాలేజీలను కేటాయించిన కేంద్రం.. మన రాష్ర్టానికి ఒక్క కళాశాల కూడా ఇవ్వలేదన్నారు. మన రాష్ట్రంలో రైతులు పండించిన ధా న్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పినా పట్టించుకోవడంలేద న్నారు. ధాన్యం సమస్యను పరిష్కరించాలని తాము ఢిల్లీకి వెళ్తే కేంద్ర మంత్రి వెటకారంగా మాట్లాడారని గుర్తుచేశారు. ‘గ్రామాల్లో ఒక్క పని చేయవు..ప్రజలకు పనిచేయవు.. రాష్ర్టానికి వచ్చే నిధులపై కేంద్రాన్ని అడగరు..పసుపు బోర్డు తీసుకురారు..’ అంటూ ఎంపీ అర్వింద్‌పై మండిపడ్డారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి పార్లమెంట్లో పసుపు బోర్డుపై అడిగితే ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి తేల్చిచెప్పారని గుర్తుచేశారు. జన్‌ధన్ ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని ప్రజలను మోసం చేసిన మోదీలాంటి చేతగాని ప్రధాని ఎక్కడాలేడన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఏడేండ్లు అవుతోందని, ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని రాష్ట్ర బీజేపీ నాయకులను మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన ఉద్యోగాల లెక్క తానుచూపుతానని, మోదీ ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు చెబుతారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ చేశారు. తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరింది వీరే..
టీఆర్ఎస్లో చేరిన వారిలో వేల్పూర్ గ్రామానికి చెందిన యువజన సంఘాల అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు గమ్మత్ కార్తిక్‌తోపాటు 50 మంది యువకులు ఉన్నారు. మెండోరా మండలంలోని వెల్కటూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు సుమన్, ముత్తెన్న, రంజిత్, రఫీ అఫ్రాన్తోపాటు 50 మంది యువకులు చేరారు. భీమ్‌గల్ మండలం బాబాపూర్‌కు చెందిన సంజీవ్,రఘు ఆధ్వర్యంలో యువకులు, సికింద్రాపూర్‌కు చెందిన రఘునాథ్ రెడ్డితోపాటు తన అనుచరులు, ముచ్కూర్కు చెందిన నాందెడపు బాలయ్యతోపాటు తన అనుచరులు, చేంగల్‌కు చెందిన యువజన సంఘాల నాయకులు, కమ్మర్పల్లి మం డలం చౌట్పల్లికి చెందిన కొమ్ముల సత్యం రెడ్డి, బోగ నవనాథ్, రవి చంద్ర, బీజేపీ నాయకులతోపాటు సునీ ల్ యువసేన నుంచి పటేల్ యువసేన, ఎస్సీ మాదిగ యువ సేన యువకులు ఉన్నారు. ఏర్గట్ల ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, సొసైటీ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య ఆధ్వర్యంలో ఏర్గట్లకు చెందిన యువకులు టీఆర్ఎస్లో చేరారు.