‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం శుభపరిణామం.. ప్రాథమికస్థాయి నుంచే ఆంగ్లబోధన ఉంటే విద్యార్థులకు ఇంగ్లిష్‌పై భయం పోతుంది. అవగాహన, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రతి సబ్జెక్టుపై పట్టు వస్తుంది..’ అని ఎల్లారెడ్డి కోర్టు మాజీ న్యాయమూర్తి నివేదిత దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించడం ఆహ్వానిందగిన పరిణామం. ప్రాథమిక స్థాయి లోనే ఇంగ్లిష్ నేర్చుకుంటే ఉన్నత విద్యనభ్యసించే సమయంలో ఇబ్బందులు ఉండ వంటున్న ఎల్లారెడ్డి కోర్టు మాజీ న్యాయ మూర్తి నివేదిత దేశ్‌పాండేతో ‘నమస్తే’ ఇంటర్వ్యూ…
-ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 1
నమస్తే : ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంపై మీ అభిప్రాయం?
నివేదిత దేశ్‌పాండే : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం మంచి పరిణామం. ప్రస్తుతం ఆంగ్లమాధ్యమం అనేది కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉన్న విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడితే అది అందరికీ అందుబాటులోకి వస్తుంది.
ఆంగ్లమాధ్యమం అమలు ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?
ఇప్పటికే కొన్ని తెలుగు మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది, అలా కాకుండా ఆంగ్ల మాధ్యమం కోసం తగిన అర్హత, బోధనా సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులను నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఇంగ్లిష్ మీడియంతో ఎలాంటి ఉపయోగం ఉంటుంది?
ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధిస్తే విద్యార్థులకు ఇంగ్లిష్ అంటే భయంపోతుంది. తెలుగు మీడియం విద్యార్థులు డిగ్రీ పూర్తవగానే న్యాయశాస్త్రం లేదా ఇతర ఏ ఉన్నత చదువుకు వెళ్లినా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. ఇంగ్లిష్ సరిగా రాకపోవడంతో చాలా మంది రాణించలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదివేవారికి ఇలాంటి ఇబ్బంది ఉండదు.
ఎలాంటి మార్పు వస్తుంది?
ఆంగ్ల మాధ్యమంతో విద్యార్థుల నాలెడ్జి పెరుగుతుంది. విషయ పరిజ్ఞానమూ ఎక్కువగా ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం సమయంలో చాలా వరకు ఉపయోగపడుతుంది.
ఆంగ్లం రాకుంటే ఉన్నత విద్యలో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది?
తెలుగు మీడియం విద్యార్థులు ఆంగ్లం ఒక సబ్జెక్టుగా చదివినప్పటికీ ఉన్నత విద్య సమయంలో వారిలో కొంత భయం ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే మొత్తం ఇంగ్లిష్ మీడియంలో చదివితే వారిలో ఎలాంటి భయం ఉండదు. కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగి ప్రతి సబ్జెక్టుపై పట్టువస్తుంది.