స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు
యాదాద్రి, జనవరి 22: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్య పూజలు కోలాహలంగా జరిగాయి. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకలను కనులారా వీక్షించి తరించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై బాలాలయ ముఖ మండపంలో ఊరేగించారు. శ్రీ లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతును నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ.200 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకొనే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్ర నామార్చన చేశారు. సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ఖజానాకు శనివారం రూ. 8,80,317 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 80,850
రూ.100 దర్శనం టిక్కెట్ 12,200
వీఐపీ దర్శనాలు 19,500
వేద ఆశీర్వచనం 2,400
నిత్యకైంకర్యాలు 7,717
సుప్రభాతం 1,800
ప్రచారశాఖ 8,500
క్యారీబ్యాగుల విక్రయం 8,250
వ్రత పూజలు 92,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 19,000
ప్రసాద విక్రయం 3,92,450
వాహనపూజలు 10,400
టోల్గేట్ 740
అన్నదాన విరాళం 12,732
సువర్ణ పుష్పార్చన 64,200
యాదరుషి నిలయం 66,710
పాతగుట్ట నుంచి 23,460
గోపూజ 100
ఇతర విభాగాలు 41,508