కుమ్మరికుంట దశ తిరిగింది. ఏండ్లనాటి దారిద్య్రం వీడింది. ఒకటికాదు రెండు కాదు దశాబ్దాలపాటు గ్రామం నుంచి మండలకేంద్రానికి వెళ్లేందుకు పోచమ్మ చెరువు వద్ద వంతెన లేక.. గ్రామం నుంచి బాలరాజ్పల్లి మధ్య తారు రోడ్డు లేక గోసపడ్డది. చుట్టూ తిరిగి కెనాల్ కాలువ వెంట వెళ్లి ఏండ్లపాటు నరకం చూసిన ఆ ఊరు, ఇప్పుడు సంతోష పడుతున్నది. టీఆర్ఎస్ సర్కారు చొరవతో బ్రిడ్జి, సహా తారు రోడ్డు నిర్మాణంతో మురిసిపోతున్నది. ఇంకా ఏండ్లనాటి సమస్యలన్నీ దూరం చేసుకొని అద్దంలా తయారైంది. మంత్రి ఈశ్వర్ ప్రత్యేక దృష్టి.. పల్లె ప్రగతి నిధులతో అన్ని వసతులు సమకూర్చుకున్నది. ఈ నెల 20న మంత్రి ఈశ్వర్ చేతుల మీదుగా పూర్తయిన రోడ్డు, వారధి, జీపీ భవనం, సీసీ రోడ్లు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది.
ప్రగతి పరుగులు..
స్వరాష్ట్రంలో గ్రామంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. కొత్తగా 20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనం, 10 లక్షలతో వైకుంఠధామం, 2.5లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. ఈజీఎస్ ద్వారా 5లక్షలు ఖర్చు చేసి ‘పల్లె ప్రకృతి వనం’ సుందరంగా తీర్చిదిద్దారు. 2.50 లక్షలతో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం నిర్మించారు. యాదవ, కుర్మ, ముదిరాజ్ సామాజిక భవనాలకు 10.50 లక్షలతో ప్రహరీలు నిర్మించారు. 4 లక్షల ఎంపీ నిధులతో రేవెల్లి కనకయ్య ఇంటి నుంచి ధర్మారం మండలం నర్సింహులపల్లి వైపు ఫార్మేషన్ రోడ్లు నిర్మించారు. కుమ్మరికుంట నుంచి ధర్మారం మండలం ఖిలావనపర్తి దాకా 3.54కోట్లతో తారురోడ్డు వేస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాల పరిధిలోని 6.23 ఎకరాల ఆట స్థలం చుట్టూ 7.20 లక్షల నిధులు వెచ్చించి మూడు వైపులా ప్రహారి నిర్మించి, ప్రధాన ముఖ ద్వారం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రధాన కూడళ్లల్లో 3 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో హైమాస్ట్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ సమీపంలో 8.25 లక్షల నిధులతో మహిళా భవన్ నిర్మిస్తున్నారు.
కుమ్మరికుంట గ్రామస్తులు మండల కేంద్రమైన జూలపల్లికి చేరుకోవాలంటే పోచమ్మ చెరువు వద్ద ఒర్రె దాటాల్సిందే. వంతెన లేక ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. వెరసి వానొస్తే ఒర్రె దాట లేక రైతులు పొలం పనులు మానేసేవారు. విద్యార్థులకు స్కూలూ బందే. ఇక గ్రామంలో ఒర్రె అవతల ఉన్న గొల్లెపల్లె వాసులు కుమ్మరికుంటకు రాలేక రేషన్ సరుకులు, తెచ్చుకోలేక ఓట్లు వేయలేక వెనుతిరిగిన సందర్భాలెన్నో ఉన్నాయి. వంతెన నిర్మించాలని ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో డీ-83 ప్రధాన కాల్వ వెంట దాదాపు 6 కిలో మీటర్లు ప్రయాణించి మండల కేంద్రానికి చేరుకునేవారు. కానీ స్వరాష్ట్రంలో సర్కారు గ్రామస్తుల చిరకాల కలను నెరవేర్చింది. ఒర్రెపై 66 లక్షలతో వంతెన నిర్మించగా, మండల కేంద్రానికి వెళ్లేందుకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరభారం తగ్గింది. దీంతోపాటే కుమ్మరికుంట-బాలరాజ్పల్లి గ్రామాల మధ్య 96 లక్షలతో తారురోడ్డును పూర్తి చేశారు. వంతెన, తారురోడ్డు నిర్మించడంతో ఏండ్ల నాటి కల నెరవేరింది.
20న ప్రారంభోత్సవాలు..
కుమ్మరికుంట మంత్రి కొప్పుల స్వగ్రామం. దీంతో గ్రామంపై మమకారంతో కొప్పుల ‘ఎల్ఎం’ ట్రస్ట్ ద్వారా 8 లక్షలతో స్వాగత తోరణం నిర్మించారు. దీంతోపాటు నిర్మాణం పూర్తయిన గ్రామ పంచాయతీ భవనం, వంతెన, తారు రోడ్డును ఈ నెల 20న మంత్రి కొప్పుల, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు పంచాయతీ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 20న ట్రస్ట్ ద్వారా గ్రామంలో నిరుపేదలు 150 మంది నిరుపేదలకు చీరలు, 15 మందికి కుట్టు మిషన్లు, 12 మంది డప్పులు, క్రీడాకారులకు క్రీడా సామగ్రి పంపిణీ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. దళితులకు స్వయం ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు శిక్షణ ఇప్పించి 30 మందికి ఒక్కొక్కరికీ రూ.50 వేల రుణం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.