ఖానాపూర్ టౌన్, మార్చి 31 : నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ కొత్తరూపు సంతరించుకున్నది. మున్సిపల్, ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నారు. 2020 సంవత్సరంలో మున్సిపాలిటీగా మారగా.. రూ.16 కోట్లతో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా రూ.69 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టడంతో సర్వాంగ సుందరంగా మారింది. రూ.2.90 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.70 లక్షలతో గోదావరి వద్ద అన్ని హంగులతో మున్సిపల్ ప్రజల సౌకర్యార్థం శ్మశాన వాటిక పనులు పూర్తి చేశారు. మారో రూ.80 లక్షలతో పట్టణ శివారులో కుమ్రం భీం చౌరస్తాలో డంప్ యార్డు పనులు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో రూ.70 లక్షలతో ఉద్యానవన పార్కు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇందులో వాకింగ్ ట్రాక్స్, టాయిలెట్స్, ఓపెన్ జిమ్, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎల్ఈడీ బల్బుల బిగింపు వంటి పనులను సుందరంగా చేపట్టారు. పట్టణవాసులు వందలాది మంది ఇక్కడికి వచ్చి సేదతీరుతున్నారు. ఇంకా కొన్ని పనులు పురోగతి దశలో ఉన్నాయి.