పవన్ సినిమాలో అవకాశం నా అదృష్టం
ప్రభుత్వ పింఛనే ఆసరాగా మారింది
కిన్నెర మెట్ల కళాకారుడు దర్శన మొగులయ్య తెలంగాణలోనే కిన్నెర కళకు గుర్తింపు
పవన్‌కల్యాణ్ సినిమాలో అవకాశం రావడం అదృష్టం
ప్రభుత్వం అందజేస్తున్న రూ.10 వేల పింఛన్ ఆసరాగా మారింది
కిన్నెర మెట్ల కళాకారుడు దర్శన మొగులయ్య
అచ్చంపేట, సెప్టెంబర్ 3 : తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ వల్లనే తన కళకు గుర్తింపు వచ్చిందని 12 మెట్ల కిన్నెర ప్రముఖ వాయిద్యా కళాకారుడు దర్శన మొగుల య్య అన్నారు. శుక్రవారం అచ్చంపేటలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాకముందు కిన్నెరను తీసుకొని సంతలో పాటలు పాడుకుంటూ జీవించేవాడినని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాకే అంతరించిపోతున్న కళలు, కళాకారులను గుర్తించారని చెప్పారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఉగాది పురస్కారం అందించి సత్కరించడంతోపాటు పాఠ్యపుస్తకం 8వ తరగతి సాంఘికశాస్త్రంలో తనకళ, ఫొటోను ముద్రించి గౌరవించడంతోపాటు కళాకారుల పెన్షన్ కింద రూ.10 వేలు అందించి ఆదుకుంటున్నారని అన్నారు. రెండు నెలల నుంచి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే తనకు గుర్తింపు రావడం ద్వారా ప్రముఖ సినిమా నటుడు పవన్‌కళ్యాణ్ రచిస్తున్న భీమ్లానాయక్లో సినిమాలో పాట పాడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉన్నదని, తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతిశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ద్వారా పవన్ సినిమాలో పాడే అవకాశం వచ్చిందన్నారు. పెద్దహీరో పవన్‌తో కలిసి సీనిమా తీయడం గొప్ప అనుభూతిగా మిగులుతుందని ఆయనన్నారు. ఆయన సాదాసీదాగా కనిపించారని, తన కిన్నెర తీసుకొని పరిశీలించి అద్భుతంగా పాటలు పాడుతున్నావని అభినందించినట్లు తెలిపారు. రంగయ్య అనే రచయిత తన కళపై పాటరాసి పలు వేదికలపై పరిచయం చేశాడని అన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరుల సహకారంతో తనకు కళాకారుల పెన్షన్ మంజూరైందన్నారు. ప్రభుత్వం అవార్డులు ఇవ్వడంతోనే తనకు ఈ అవకాశం వచ్చిందన్నారు. మియాసాబ్ పాట మాదిరిగానే పవన్ పాట పాడించారని అన్నారు. పవన్‌ను కలిసి మరిన్ని పాటలు పాడే అవకాశం కల్పించాలని కోరుతానని చెప్పారు. కిన్నెర మెట్ల కళ తనతో ముగియకుండా పదిమందికి నేర్పించాలనే తపనతో ఉన్నానని అన్నారు. ప్రభుత్వం కూడా తన కళను గుర్తింపు తెచ్చేవిధంగా పలువురికి శిక్షణ ఇప్పించి కళను బతికించేందుకు హామీ ఇచ్చిందన్నారు. చైన్నె అడవుల్లోకి తీసుకెళ్లి పాటలు పాడించారని అన్నారు. పవన్ కలిసి సినిమాలో పాట పాడే అవకాశం రావడం ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ద్వారానే సాధ్యమైందన్నారు.