
నల్లగొండ, జనవరి12 : నల్లగొండ పట్టణంలో రహదారుల విస్తరణ, జంక్షన్ల ఏర్పాటు మీడియన్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర సుందరీకరణ పనులపై మున్సిపల్, ఆర్అండ్బీ, రెవెన్యూ, హైవే అధికారులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జంక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలోని వివేకానంద విగ్రహం, ఎన్జీ కాలేజీ, బస్టాండ్ , సుభాశ్ చంద్రబోస్ విగ్రహం, మునుగోడు రోడ్డు జంక్షన్, క్లాక్ టవర్ సెంటర్, సావర్కర్ నగర్, పాత కలెక్టరేట్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, జైల్‌ఖానా, వైఎస్ఆర్ విగ్రహం వద్ద పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మొత్తం పది కిలోమీటర్ల మేర కొత్త జంక్షన్లు, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం రోడ్ల అభివృద్ధిపై రూపొందించిన మ్యాపులను పరిశీలించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ రమేశ్, హైవేస్ ఈఈ రాజేందర్, సూర్యాపేట డిప్యూటీ ఈఈ ప్రతాప్‌రెడ్డి, నల్లగొండ ఏఈఈ మురళి, మున్సిపల్ డీఈ అశోక్ పాల్గొన్నారు.
స్వదేశీ దర్శన్‌లో కాపురాల గుట్ట
రామగిరి, జనవరి 12 : స్వదేశీ దర్శన్ ప్రోగ్రాంలో నల్లగొండ నడిబొడ్డులోని కాపురాల గుట్ట చేరింది. అయితే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గతంలోనే గుట్టపైకి వెళ్లీ పరిశీలన చేసి పలు సూచనలు చేశారు. గత జనవరిలోనే కాపురాల గుట్టను అధిరోహించిన ఆయన రేచర్ల పద్మనాయకుల రాజ వంశస్తులు గురించి పరిశీలించారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మానుమెంట్స్ అండ్ సైట్స్(యూఎన్‌ఈఎస్‌సీఓ) సభ్యుడు ఆదోని వెంకటరమణారావు కేంద్ర టూరిజం శాఖకు ప్రతిపాదించిగా ఆ శాఖ స్వదేశీ దర్శన్ ప్రోగ్రాం కింద పరిశీలనకు స్వీకరించినట్లు తెలిపారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి లేఖ రాశారు.
25నాటికి ఓటరు గుర్తింపు కార్డులు
నల్లగొండ, జనవరి 12 : జిల్లాలో ఇప్పటి వరకు నూతన ఓటర్లుగా నమోదైన 5798మందికి ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం వరకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆయా జిల్లాల కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 25నాటికి ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఎపిక్ కార్డు అందిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 46,106 ఏకరీతి ఫొటో జాబితాను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తామన్నారు. ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, డీటీ విజయ్ పాల్గొన్నారు.