
దేవరకొండ, ఆగస్టు 10 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కెనాల్ రెండో దశ పనులపై మంగళవారం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని జనప్రియగార్డెన్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సీఈ హమీద్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23 మంది తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సీఈ హమీద్‌ఖాన్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో కరువును పారదోలి, వలసలు నివారించేందుకు పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు శ్రీశైలం రిజర్వాయర్ వెనుక జలాల నుంచి 90 టీఎంసీల నీటిని 60 రోజుల్లో తోడి ఐదు దశలల్లో ఎత్తిపోసి 6 రిజర్వాయర్లను నింపుతుందన్నారు. 6 జిల్లాల్లోని 70 మండలాల్లో 12,30, 000 ఎకరాలకు సాగునీరు, 126 గ్రామాలకు తాగునీరు ఇవ్వనున్నట్లు చెప్పారు. అప్రోచ్ చానల్స్, ఓపెన్ కెనాల్స్, సొరంగాలు, పంప్ హౌజ్‌లు చేపడుతున్నట్లు తెలిపారు. అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ, ఉదండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లలో 67.97 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్లు చెప్పారు. డిండి ఎత్తిపొతల ప్రాజెక్టు పరిధిలోని సింగరాజ్‌పల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి ప్రాజెక్టుల పనులు చేపడుతున్నామని అన్నారు. సమావేశంలో మాట్లాడిన పలువురు వక్తలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్జతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, డీఎస్పీ ఆనందరెడ్డి, ఈఈ రవీందర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజేందర్, చింతపల్లి, మర్రిగూడ మండలాల ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
మా ప్రాంతానికి నీళ్లు వస్తే సంతోషం. ఇలాంటి ప్రాజెక్టు వస్తాయని ఏనాడూ అనుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత తొందరగా ప్రాజెక్టు పనులు చేపట్టడం హర్షణీయం. సీఎం సార్‌ను జన్మలో మర్చిపోం. త్వరగా పర్యావరణ అనుమతులు పొంది ప్రాజెక్టును పూర్తి చేయాలి.
ప్రాజెక్టు పనులు తొందరగా పూర్తి చేయాలి. రిజర్వాయర్లు త్వరగా పూర్తి చేసి మా ప్రాంతానికి సాగునీరు అందించాలి. మా మండలంలో రెండు రిజర్వాయర్లు నిర్మించాలి. మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చొరవ చూపుతున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
మాస భాస్కర్, చింతపల్లి మండలం