
నీలగిరి, ఆగస్టు 8 : రోజురోజుకూ మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం అయినవారూ దారుణాలకు ఒడి కడుతున్నారు. తండ్రి తరువాత తండ్రి లాంటి బాబాయ్‌ని అన్న కొడుకులు కర్కషంగా హత్య చేశారు. రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని కొడుకులు హత్య చేస్తుంటే.. ఆపాల్సిన అన్న వారికి సహకరించడం బాధాకరం. గెట్టు పంచాయితీని దృష్టిలో పెట్టుకుని పొలం వద్దకు బోరు పెట్టేందుకు వచ్చిన వ్యక్తిని అన్న కొడుకులు దారుణంగా హతమార్చారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అక్కలాయిగూడెంలో అదివారం జరిగింది. నల్లగొండ వన్ టౌన్ సీఐ బాలగోపాల్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కలాయిగూడెం గ్రామానికి చెందిన ఆవుల రామస్వామి (57), ఆయన అన్న కాశయ్యకు ఆదే గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రామస్వామిపై పలుమార్లు కాశయ్య, అతని భార్య రత్నమ్మ, కుమారులు మహేశ్, మల్లేశ్ దాడికి పాల్పడ్డారు. పక్కపక్కనే ఉన్న వీరి వ్యవసాయ భూమి వద్ద గేట్ల పంచాయితీ నడుస్తుండగా.. గ్రామ శివారులో ఉన్న భూమి వద్దకు ఆదివారం ఉదయం బోరు పెట్టేందుకు రామస్వామి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న కాశయ్య, రత్నమ్మ, మహేశ్, మల్లేశ్.. రామస్వామి వద్దకు వచ్చి గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో కింద పడిపోయిన రామస్వామిపై పక్కనే ఉన్న కడీతో అందరూ కలిసి ముఖంపై మోది హతమార్చారు. ఘర్షణ పడుతున్న విషయాన్ని గమనించిన రామస్వామి కొడుకు కిరణ్ కుటుంబ సభ్యులకు చెప్పి అక్కడికి వెళ్లేసరికి తండ్రి హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ ద్వారా వివరాలను సేకరించారు. మృతుడి కుమారుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. నిందితులు కాశయ్య, రత్నమ్మ, మహేశ్, మల్లేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.