రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాం సర్వీసులకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లోనూ వయో పరిమితి సడలించడంపై నిరుద్యోగ అభ్యర్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రెండేండ్ల కిందట విడుదలైన నోటిఫికేషన్లో త్రుటిలో ఉద్యోగావకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులు నాటి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. వయో పరిమితి మించిపోవడంతో పోలీస్ ఉద్యోగం కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50వేల మందికి పైగా అభ్యర్థులకు వరంలా మారింది. పోలీస్ ఉద్యోగం సాధించడానికి కానిస్టేబుల్‌కు 22ఏండ్లు, ఎస్ఐకి 25 సంవత్సరాల వయో పరిమితి ఉన్నది. చాలా మంది ఏండ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. వయో పరిమితిని మరో మూడేండ్లకు పెంచడంపై వారిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు పోలీస్ శాఖకు పెద్ద పీట వేసింది. హోంగార్డు స్థాయి మొదలుకొని ఉన్నతస్థాయి సిబ్బందికి అనేక వెసులుబాట్లు కల్పించింది. పని ఒత్తిడి ఉన్నందున వీక్ ఆఫ్‌తో పాటు వేతనాలు పెంచింది. కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు కూడా వయో పరిమితి పెంచాలని డిమాండ్లు రావడంతో మూడేండ్ల సడలింపును కల్పించింది. ఇప్పటి వరకు కానిస్టేబుల్ 22, ఎస్ఐ 25, డీఎస్పీ, డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ 28, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వయో పరిమితి 26ఏండ్లు మాత్రమే. అయితే, ప్రభుత్వం కల్పించిన అవకాశంతో వయో పరిమితి మూడేండ్లు పెరుగనున్నది.
పోలీస్ ఉద్యోగం సంపాదించాలనేది నా చిన్ననాటి కోరిక. రెండేండ్ల క్రితం రిక్రూట్మెంట్లో స్వల్పతేడాతో జాబ్ మిస్ అయ్యాను. ప్రస్తుతం నాకు 26 సంవత్సరాలు. పోలీస్ ఉద్యోగానికి అర్హత కోల్పోయాననే బాధ ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ నా ఆశలకు ఊపిరి పోస్తూ వయో పరిమితిపై మూడేండ్ల సడలింపు కల్పించారు. ఈసారి మరింత కష్టపడి పోలీస్ ఉద్యోగాన్ని సాధిస్తా.
– అయితరాజు వెంకన్న, చిట్యాల