నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలువగా మరోవైపు భారీ పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు పొంది హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. దాంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దీనికి తోడు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో పలు ప్రైవేటు సంస్థలు నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు అందిస్తున్నాయి.
ఉద్యోగార్థులకు సూర్యాపేట జిల్లా ఉపాధి కార్యాలయం కొండంత భరోసా కల్పిస్తున్నది. పదో తరగతి నుంచి పీజీ పాస్ అయిన యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నది. ఐదేండ్లలో జిల్లాలో 440 మందికి శిక్షణ ఇవ్వగా 270 మందికి పలు ఉద్యోగాలు లభించాయి. ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో టెక్నికల్, బిజినెస్ స్కిల్స్‌లో శిక్షణ ఇప్పిస్తుండడంతో యువత సద్వినియోగం చేసుకుంటున్నది. పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన యువత ఆనందం వ్యక్తం చేస్తున్నది.
సూర్యాపేట జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో గడిచిన ఐదేండ్లలో 440 మందికి శిక్షణ ఇవ్వగా 270 మందికి ఉపాధి లభించింది. అందులో రైస్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో 30 మందికి, సత్యం కంప్యూటర్స్ 50, డాటాప్రొ కంప్యూటర్స్ 180, అలయన్స్ ట్రైనింగ్ సెంటర్ 30, సింక్రో సార్వ్ గ్లోబల్ సొల్యూషన్ 30, విస్రీ టెక్నాలజీస్ 30, ఎన్ఐటీ హుజూర్నగర్ 30, చరిత కంప్యూటర్స్ ఆధ్వర్యంలో 60 మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించారు. రెండు నుంచి మూడు నెలలకోసారి ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన మరి కొందరు స్వయం ఉపాధి రుణాలతో యూనిట్లు స్థాపించుకుంటున్నారు.
సూర్యాపేట పట్టణానికి చెందిన ఐ.లోకేశ్ అనే యువకుడు పదోతరగతి పూర్తి చేసి ఫుట్‌పాత్ వ్యాపారంలో కుటుంబ సభ్యులకు సహాయకారిగా పనిచేసేవాడు. ఖాళీ సమయంలో కళ్లద్దాలు, హెల్మెట్లు విక్రయించేవాడు. జిల్లా ఉపాధి కల్పన అధికారులు పత్రికలో ఇచ్చిన ప్రకటన చూసి మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో నిర్వహించిన జాబ్‌మేళాలో హైదరాబాద్‌కు చెందిన సుప్రీత్ ఇన్ఫ్రా డెవలపర్స్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం రూ.15వేల వేతనంతో పాటు ఇన్సెంటివ్ కూడా బాగానే వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు.
డిగ్రీ పూర్తయిన తర్వాత ఉన్నత చదువులకు వెళ్లలేక ఏడాదిపాటు ఇంటి దగ్గరే ఉన్నాను. 2016లో సూర్యాపేటలో ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు హాజరై ప్రైవేట్ కంపెనీలో రూ.5,500 వేతనానికి ఎంపికయ్యాను. ప్రస్తుతం సుక్రుతి ఇన్ఫ్రాలో రూ.35వేల వేతనంతో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. వేతనంతో పాటు ఇన్సెంటివ్స్, కమీషన్లు వస్తున్నాయి. నేను ఈ రోజు మంచి స్థానంలో ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన జాబ్‌మేళా కారణం.
– బద్దెల మల్లేశ్, సూర్యాపేట
వివిధ సంస్థల ద్వారా శిక్షణ అందించి ఉపాధి కల్పించడం నిరుద్యోగులకు వరం. పదో తరగతి మొదలుకుని ఉన్నత చదువులు చదివిన వారు జాబ్‌మేళాలో పాల్గొంటున్నారు. విద్యార్హతలకు అనుగుణంగా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం పొందుతున్నారు. జిల్లాలో పలు సంస్థలు నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటి వరకు 200 మంది హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారు.
మాధవరెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి, సూర్యాపేట