నల్లగొండ ప్రతినిధి, మే 9(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నల్లగొండకు మరో వరం ప్రకటించారు. పట్టణంలోకి ప్రవేశించేందుకు మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అనుమతులు లభించాయి. గత నెల 28న సీఎం కేసీఆర్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ దశ దినకర్మలో పాల్గొనేందుకు నార్కట్‌పల్లికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షిస్తూ కొత్తగా మరికొన్నింటికీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో మర్రిగూడ బైపాస్ రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మా ణం ఒకటి.
నార్కట్‌పల్లి-అద్దంకి రోడ్డు పైనుంచి పట్టణంలోకి రావడం వాహనదారులకు పెద్ద సవాల్‌గానే మారింది. హైవే పైనుంచి పట్టణంలోకి క్రాస్ అవుతున్న వాహనదారులు, పాదచారులు అనేక సార్లు ప్రమాదాలకు గురయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం పలు సందర్భాల్లో స్థానికులు ఆందోళనలకు దిగారు.
నల్లగొండ పట్టణాభివృద్ధిపై గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత డిసెంబర్ చివర్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తండ్రి పెద్దకర్మకు హాజరైన ప్పుడు పట్టణంలో పర్యటిస్తూ అభివృద్ధిపై సమీక్షించారు. రానున్న కొద్దిరోజుల్లోనే నల్లగొండ రూపురేఖలు మార్చాలని ఆదేశించారు.
జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సారథ్యంలో నల్లగొండ పట్టణంలో ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్ల విస్తరణ, పార్కుల ఆధునీకరణ, కళాభారతి, ట్యాంకుబండ్ నిర్మాణం, హెలిప్యాడ్ ఇలా అనేక పనులకు శ్రీకారం చుట్టారు. వీటికి అనుబంధంగా మరికొన్ని అవసరాలను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్‌ల దృష్టికి తీసుకువచ్చారు.
మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సైతం అనుమతులు మంజూర య్యాయి. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సూచన మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆర్ అండ్ బీ ఇంజినీర్ల బృందం ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. మొత్తం రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో 400 మీటర్ల పొడవున ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తూనే పట్టణంలోకి ప్రవేశించేందుకు సర్వీసు రోడ్లు నిర్మిస్తారు. బ్రిడ్జి దిగువ నుంచి పట్టణంలోకి వచ్చి పోయేలా నిర్మాణం చేపట్టనున్నారు.
నల్లగొండ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తూ పట్టణ ప్రజల చిరకాల కోరికలు నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల పక్షాన రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. పట్టణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఇప్పటికే వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే అన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
మర్రిగూడ బైపాస్‌రోడ్డుపై ఫ్లైఓవర్ బ్రిడ్జి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. నల్లగొండ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ స్వీయ పర్యవేక్షణ, మంత్రి జగదీశ్‌రెడ్డి సంపూర్ణ సహాకారం మరువలేనిదని, వారికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
– ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి