మే 5 : గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సాధారణ ప్రసవాలు, శిశువు, బాలింతల ఆరోగ్యంపై మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు ఎక్కువ మోతాదులో అన్నం, పచ్చడి తినడం వల్ల అధిక బరువు పెరుగుతారని, సాధారణ ప్రసవాలు కాకపోవడానికి అధిక బరువు ఒక కారణమని తెలిపారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన ఆహారం తీసుకుంటే సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్, జడ్పీ స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యశోద, డీఎల్ఓ డాక్టర్ పాపారావు, పీహెచ్సీ వైద్యాధికారి సత్యప్రకాశ్, ఆరోగ్య సిబ్బంది.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మండలంలోని అన్నంపట్ల, ఎర్రబెట్టె తండాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఓ మందడి ఉపేందర్‌రెడ్డితో కలసి పరిశీలించారు. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాబ్‌లో నమోదు చేయాలని, రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లు పది రోజుల్లో పూర్తి కావాలన్నారు. అనంతరం అధికారులు నమోదు చేస్తున్న రికార్డులను పరిశీలించారు.
భువనగిరి అర్బన్ విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత ర్యాంకులు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర, బాలికల వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమయ్యే ప్రేరణ, శిక్షణ తరగతులపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు పట్టుదల, సొంత కృషితో ప్రేరణ పొంది, ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళిక ప్రకారం చదివి ఉత్తీర్ణత పొందాలన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చదుకోవాలని డీఈఓ కె.నర్సింహ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య పాల్గొన్నారు.