వలిగొండ, మే 5: నిరుపేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి గణేశ్ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలో 87 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు సొంత నిధులతో పోచంపల్లి పట్టు చీరె, పంచ, కండువాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల కోసం ఏరాష్ట్రంలో లేని విధంగా కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారని అన్నారు.
అనంతరం లింగరాజుపల్లి గ్రామంలో ఎస్డీఎఫ్ రూ.25 లక్షల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అలాగే ఇటీవల హత్యకు గురైన ఎరుకల రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. నర్సయ్యగూడెంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.25 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమాల్లో ఎంపీపీ నూతి రమేశ్‌రాజ్, జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనర్సింహ, పీఏసీఎస్ చైర్మన్లు సుర్కంటి వెంకట్‌రెడ్డి, చిట్టెడి వెంకట్రాంరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ కునపురి కవిత, తాసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బీబీనగర్ : మండల కేంద్రంలో నూలి శేషగిరి రావు ట్రస్టు కొత్తగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా గ్రంథాలయం నిర్మాణానికి 226 గజాల స్థలం కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేసిన నూలి శేషగిరిరావు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.శేషగిరిరావు ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ విజయమనోహర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితంతో సంపాదించే దాంట్లో ఎంతో కొంత దానమిచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. అనంతరం శేషగిరి రావు కుమారులను ఎమ్మెల్యే సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్, జిల్లా స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ స్థాయీ సంఘం చైర్పర్సన్ గోలి ప్రణీతా పింగళ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ్ద చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మంచాల రవి కుమార్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బొక్క జైపాల్‌రెడ్డి, గోరుకంటి బాలచందర్, గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి సుధీర్, నల్లగొండ జిల్లా కార్యదర్శి బి.బాలమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కాసుల సత్యనారాయణ పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : గంగసానిపల్లి, వడాయిగూడెం గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. జడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు అమరేందర్‌గౌడ్, మల్లయ్య, పాండు, ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు.