మోటకొండూర్, మే 5 : రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో గ్రామాలకు మహర్దశ పట్టనున్నది. పల్లెసీమల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ప్రతి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు నిధులు మంజూరు చేస్తున్నది. సీఎం కేసీఆర్ వాసాలమర్రికి వచ్చిన సందర్భంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అందులో భాగంగా మోటకొండూర్ మండలంలోని 18 గ్రామపంచాయతీలకు నిధులు మంజూరయ్యాయి.
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చొరవతో సీఎం కేసీఆర్ మండలంలోని 18 గ్రామపంచాయతీలకు రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేయడంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపడుతుండడంతో గ్రామాలు అద్దంలా మెరువనున్నాయి. అన్ని గ్రామాల్లో రూ. 25 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇప్పటికే ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేశారు. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. దాంతో ప్రత్యేక నిధులతో గ్రామాలకు మహర్దశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అడిగిన వెంటనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ రూ.25 లక్షలు మంజూరు చేయడం గొప్ప విషయం. ఈ నిధులతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం మా బాధ్యత. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే పనులను ప్రారంభిస్తాం. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
-గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషితో మండలంలోని ప్రతి గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేయడం హర్షణీయం. మండలానికి రూ. 4.50 కోట్ల నిధులు కేటాయించడంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. నిధుల మంజూరుతో ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలానికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు, అందుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు.
-పల్లా వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ
టీఆర్ఎస్ హయాంలోనే మండలం అభివృద్ధి చెందుతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితోనే గ్రామాలు ప్రగతి పథంలో నడుస్తున్నాయి. మండలంలోని ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరిన వెంటనే నిధులు మంజూరు చేయడం హర్షణీయం. ప్రభుత్వ విప్ సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం. నిధుల మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ సునీతారెడ్డికి ధన్యవాదాలు.
-బొట్ల యాదయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు