రామగిరి / సూర్యాపేట అర్బన్, మే 5 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరుగనుంది. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ నెల 7నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 66,028మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 33,020మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 33,008మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 117కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా జిల్లాల్లోని డివిజన్ కేంద్రాల్లో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లను డీఐఈఓ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించి మాట్లాడారు.