చీకట్లను చీల్చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా ప్రసరింపజేస్తున్న విద్యుత్‌తో అన్ని రంగాలు వర్ధిల్లుతున్నాయి. 24గంటల విద్యుత్‌తో పరిశ్రమల్లో కార్మికులకు పుష్కలంగా ఉపాధి దొరుకుతున్నది. పక్క రాష్ర్టాల నుంచి వచ్చిన వాళ్లకూ చేతినిండా పని లభిస్తున్నది. రెండు షిఫ్టుల్లో వర్క్ నడుస్తుండడంతో ఉత్పత్తి రెండింతలు పెరిగింది. స్వరాష్ట్రంలో సాధ్యమైన ఈ మార్పుపై పారిశ్రామిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సమైక్య పాలనలో ఎండ కాలం వచ్చిందంటే పవర్ హాలిడేస్ ఆర్థికంగా కుదేలు చేసేవని, ఇప్పుడు నిరంతర విద్యుత్ పరిశ్రమల వృద్ధికి ఊతమిస్తున్నదని చెప్పుకొస్తున్నాయి. వివిధ రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికులు సైతం కేసీఆర్ సర్కారుకు జై కొడుతున్నారు.
సూర్యాపేట, మే 5 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో పరిశ్రమలు నడువలేకపోయాయి. కరెంట్ కోతలతోపాటు లో ఓల్టేజీతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రోజుకు ఐదు నుంచి 6 గంటలు వచ్చే కరెంట్‌లో పదిసార్లు కోతలే ఉండేవి. దాంతో కూలీలకు చేతినిండా పని కల్పించలేక, సమయానికి ఉత్పత్తులను అందించలేక, ఆదాయం పొందలేక మూత పడే స్థితికి వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిశ్రమలకు పునరుజ్జీవం వచ్చింది. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిశ్రమలు నిరంతరాయంగా నడుస్తున్నాయి. డే అండ్ నైట్ షిఫ్ట్లతో కూలీలకు పని దొరుకుతున్నది. సకాలంలో ఉత్పత్తులు తయారవడంతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో కొత్త ఇండస్ట్రీస్ ఏర్పాటవుతున్నాయి. పరిశ్రమలకు నీళ్లు, విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉండే విధంగా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. నాడు కరెంట్ కోతలతో ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పరిశ్రమ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కరెంట్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
జిల్లాలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలతోపాటు కొత్తగా ఏర్పాటవుతున్న వాటిలో కార్మికుల అవసరం పెద్ద సంఖ్యలో ఉంటున్నది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మన దగ్గర కరెంట్ పుష్కలంగా ఉండడంతో రోజంతా పనిచేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూలీలు జిల్లాకు వలస వస్తున్నారు. పారాబాయిల్డ్, బిన్నీ రైస్ మిల్లులు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వనరులే దీనికి కారణమని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. నాడు విద్యుత్ సరఫరా లేక వర్క్ ఆర్డర్లు తీసుకోకుండా ఉన్నామని, నేడు వ్యాపారాలు పెంచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నామని అంటున్నారు.
తెలంగాణ వస్తే కరెంట్ కోతలుంటాయని అనేక ఇబ్బందులుంటాయని అపోహలు సృష్టించారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమలకు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. పరిశ్రమలు కుంటు పడకుండా మంచిగా నడుస్తున్నాయి. కరెంట్ కోతలు లేకపోవడంతో సిమెంట్‌ను అనుకున్న దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కూలీలకు ఇబ్బందులు లేవు.
-ఎంవీ రాంబాబు, ఎలక్ట్రికల్ డీజీఎం, సాగర్ సిమెంట్స్ పరిశ్రమ, మఠంపల్లి
మాకు కరెంట్‌తోనే పని. గతంలో కరెంటు లేక వ్యాపారం సరిగ్గా నడిచేది కాదు. రోజుకు నాలుగు ఐదు సార్లు పోవడం వల్ల కస్టమర్లు ఇబ్బంది పడేవారు. మిల్లులో పనిచేసే కార్మికులకు చేతినిండా ఉండకపోయేది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కరెంటు సమస్యలు లేవు. 24 గంటలూ అందిస్తున్నారు. ఇప్పుడు మా వ్యాపారం మంచిగానే నడుస్తున్నది.
-ఎద్దు సురేందర్ బాబు, తిప్పర్తి, రైస్ మిల్లు యజమాని
గత ప్రభుత్వాల కాలంలో పరిశ్రమలకు 6 గంటలు మాత్రమే ఇచ్చేది. ఆ సమయంలో కొద్దిసేపు రైస్‌మిల్లు నడిపించే వాళ్లం. రోజంతా కరెంటు లేక వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో నష్టాలు వచ్చేవి. తెలంగాణ వచ్చిన తర్వాత 24గంటల కరెంటు ఇస్తున్నారు. రైస్ మిల్లులు ఇరాం లేకుండా నడుస్తున్నాయి. మా వ్యాపారం లాభాల్లోకి వెళ్లింది. నిరంతర విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
-దాచేపల్లి వెంకటేశ్వర్లు, రైస్‌మిల్లు యాజమాని, బాలెంల, సూర్యాపేట మండలం
తెలంగాణ రాక ముందు వేసవి వచ్చిందంటే చాలు కరెంటు కష్టాలు మొదలయ్యేవి. ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించేది. దానివల్ల పవర్ లూమ్స్ నడువక చాలా ఇబ్బంది పడేవాళ్లం. కరెంట్ కోతతో మిల్లులు బంద్ చేసుకోవాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. 24 గంటల విద్యుత్ అందిస్తున్నారు. రాత్రి, పగలు పనిచేసుకునే అవకాశం కలిగింది. ఓ ఓల్టేజీ సమస్య లేకపోవడంతో ఎన్ని పవర్‌లూమ్స్ నడిచినా విద్యుత్ సమస్యలేమీ రావడం లేదు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి వల్లే ఇది సాధ్యమైంది. ఏ పనికైనా కరెంటే ముఖ్యం. దాని సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి.
– గాద జానయ్య, పవర్లూమ్ యజమాని,
ఇండస్ట్రియల్ ఏరియా, ఆర్జాలబావి, నల్లగొండ
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం అరిగోస పడ్డాం. ఎప్పుడు కరెంట్ వస్తదా అని కండ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూసే వాళ్లం. పంటలు కాపాడుకునేందుకు రాత్రి బావులకాడ జాగారం చేసేది. త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో కోతలు ఉండడంతో శానా ఇబ్బందులు పడ్డాం. లో ఓల్టేజీతో మోటర్లు కాలేవి. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు తీరినయి. రంది లేకుండా పంటలు పండించుకుంటున్నాం. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-కొలను జంగారెడ్డి, రైతు, కంచనపల్లి, వలిగొండ మండలం
గతంలో కరెంటు కోతల కారణంగా టైలరింగ్ సరిగా చేయలేక పోయాం. విద్యుత్ కోతలతో మాన్యువల్ మిషన్ తొక్కలేక, కరెంట్ మిషన్లు కోతలతో నడపలేక ఎంతో ఇబ్బంది పడ్డాం. పండుగల సమయంలో విద్యుత్ కోతలతో రెండు జతల బట్టలు కూడా కుట్టలేకపోయాం. పూటగడువని పరిస్థితులు ఎదుర్కొన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు పనులు మంచిగా అవుతున్నాయి. రాత్రి పూట కూడా ఫుల్కరెంట్తో పనిచేసుకుంటున్నాం.
– వెంపటి శేఖర్, టైలర్, చిట్యాల