యాసంగి వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్ పోరాటం ఉధృతంగా సాగుతున్నది. రైతన్నకు మద్దతుగా క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపిన ఉద్యమ పార్టీ ఇప్పుడు చలో ఢిల్లీకి సిద్ధమైంది. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు దేశ రాజధానిని వేదిక చేసుకున్నది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో మహాధర్నాకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తుంది. వీలైనంత ఎక్కువమంది రాష్ట్రం నుంచి తరలివెళ్లి కేంద్రంపై పోరాటంలో భాగస్వాములు కావాలన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునందుకుని ఉమ్మడి జిల్లా నేతలు సమాయత్తమవుతున్నారు.
ఆదివారం ఉదయం 10గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లల్లో ఎక్కువమంది ఢిల్లీకి బయల్దేరనున్నారు. మిగిలిన వారితోపాటు రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు సాయంత్రం 5 గంటలకు, రాత్రి 8 గంటల విమానాల్లో చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 10గంటల నుంచి ప్రారంభమయ్యే మహా ధర్నాలో పెద్దసంఖ్యలో భాగస్వాములు కానున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్ల కొనుగోలుపై కక్షపూరితంగా వ్యవహరిస్తుండడంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పార్టీ యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. అందులో భాగంగా దశల వారీగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తొలి దశలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమ ఆవశ్యకతను వివరించారు.
క్షేత్రస్థాయి వరకు పార్టీ అధినేత ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా పోరాడేందుకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. అందుకు అనుగుణంగా ఈ నెల 4న అన్ని మండలాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టి, రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు నిర్వహించారు. 6న ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులను దిగ్బంధనం చేసి నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ-హైదరాబాద్, వరంగల్-హైదరాబాద్, నార్కట్‌పల్లి-అద్దంకి, నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారులపై ఎక్కడికక్కడే రైతులతో కలిసి పార్టీ శ్రేణులు బైఠాయించారు. దాంతో ఆయా రోడ్లపై రాకపోకలను స్తంభింపజేసి కేంద్రంపై వ్యతిరేకతను చాటిచెప్పారు.
7న మూడు జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన దీక్షలు విజయవంతంగా నిర్వహించారు. నల్లగొండలో మంత్రులు మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, యాదాద్రిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ముఖ్యఅతిథులుగా హాజరై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇక 8వ తేదీన గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల నల్లజెండాలు ఎగురవేసి క్షేత్రస్థాయి వరకు ఆందోళనను ఉధృతంగా తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ప్రజలకు వివరిస్తూ నల్లబ్యాడ్జీలు, జెండాలతో ర్యాలీ తీశారు.
రాష్ట్ర రైతుల పట్ల కేంద్రంలోని మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి జిల్లా అంతటా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యేలంతా పార్టీ శ్రేణులను ముందుండి నడిపించారు. అంతిమంగా కేంద్రంపై పోరాటానికి ఢిల్లీని వేదికగా చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి నేడు ఢిల్లీకి పయనమయ్యేందుకు ముఖ్యనేతలంతా సిద్ధమయ్యారు.
రేపు దేశరాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో టీఆర్ఎస్ మహాధర్నాకు ఏర్పాట్లు చేస్తున్నది. కార్యక్రమానికి తరలివెళ్లేందుకు ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్య నేతలంతా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు దశలవారీగా అందుబాటులో ఉన్న విమానాలకు అనుగుణంగా తరలివెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేశారు. ఉదయం 10 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లల్లో చాలా మంది ఢిల్లీకి బయల్దేరనున్నారు. మిగిలిన వారితో పాటు రైతుబంధు సమితి జిల్లా చైర్మన్లు, మున్సిపల్, మార్కెట్ కమిటీల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలంతా సాయంత్రం 5, 8 గంటల విమానంలో వెళ్లేలా ప్లాన్ చేశారు. నేటి రాత్రి వరకు అందరూ ఢిల్లీకి చేరుకునేలా పార్టీ ఆదేశించింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే మహాధర్నాలో పాల్గొననున్నారు.
టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఈ విషయమై స్పందిస్తూ ఇప్పటికే ఢిల్లీ వెళ్లేవారూ అన్ని ఏర్పాట్లతో సిద్ధమయ్యారని వెల్లడించారు. విమాన టిక్కెట్లు, ఢిల్లీలో వసతికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఆదివారం అందరూ ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు. రేపు జరిగే ధర్నాలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలంతా పాల్గొంటామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో నిర్వహించిన ఆందోళనలు విజయవంతమయ్యాయని. ఢిల్లీలో చేపట్టే ధర్నాతో కేంద్రంపై మరింత ఒత్తిడి తెస్తామని వివరించారు.
-రవీంద్రకుమార్, టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు