జూలూరుపాడు : మహాశివరాత్రి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం( Kothagudem ) జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ప్రసిద్ధ స్వయంభూ క్షేత్రమైన శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారిని ఆదిలాబాద్ జిల్లా జడ్జి కాళ్లూరు ప్రభాకర్ రావు ( Kallur Prabhakar Rao ) కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో వి.ఎల్. వెంకట్రావు, ప్రధాన పౌరోహితులు తెలికిచర్ల మధు కుమార్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో జడ్జి ప్రభాకర్ రావు ప్రత్యేక అభిషేకాలు, గోత్రనామార్చనలు తదితర విశేష పూజలు నిర్వహించారు.
మండలంలోని శైవ క్షేత్రాలు, ఇతర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కాకర్ల గ్రామం సమీపాన పాలగుట్టపై స్వయంభూగా వెలసిన రుక్మిణీ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో శివరాత్రి వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు.