గతంలో వేసవి వస్తుందంటే చాలు జనం హడలెత్తే వారు. ఓ వైపు సూర్యుడి ప్రతాపంతో ఎండ వేడిమికి ఉడికిపోతే మరోవైపు వచ్చీరాని కరెంటుతో సతమతమయ్యే వారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, కూలర్లను ఆశ్రయించే అవకాశమే ఉండేది కాదు.
24 గంటల్లో కనీసం 12 గంటలకు పైగా కోతలతోపాటు వచ్చిన సమయంలోనూ లోఓల్టేజీ ఇతర సమస్యలు ఉండేవి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత రాష్ట్రం ఏర్పాటైనా సరే కరెంట్ కటకటతో అట్టుడికిపోతారని సమైక్యవాదులు దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కానీ రాష్ట్రం ఏర్పాటైన కొద్ది కాలంలోనే సీఎం కేసీఆర్ కరెంటు వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి విజయం సాధించారనడానికి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం.
నడి వేసవిలో డిమాండ్ పీక్ స్టేజీకి వెళ్లిన ప్రస్తుత సమయంలోనూ గృహాలకే కాదు వ్యవసాయం, పరిశ్రమలకు సైతం షరతులు లేకుండా 24 గంటల కరెంటు సరఫరా చేస్తూ దేశంలోనే రాష్ర్టాన్ని ప్రత్యేకంగా నిలబెట్టారు. ప్రస్తుతం గుజరాత్‌తోపాటు అనేక రాష్ర్టాలు తీవ్ర కరెంటు కోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే రాష్ట్రంలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నడి వేసవిలోనూ నిరంతరాయంగా సరఫరా కొనసాగుతున్నది. నిత్యం 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరాతో ఉమ్మడి జిల్లాలో ఆటంకాలు లేని కరెంటు ప్రజలకు అందుబాటులో ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు సరఫరా అనేది పెద్ద టాస్క్. ఆనాడు ఉన్న వనరులను వాడుకోలేని దుస్థితి. కరెంటు ఉత్పత్తి, కొనుగోళ్లపై పెద్దగా దృష్టి పెట్టకుండా ఉన్న దాంట్లోనే సర్ధుబాటు చేసే ప్రయత్నాలు చేసేవారు. దాంతో వ్యవసాయానికి 9గంటలు, గృహ, ఇతర వినియోగానికి 12 నుంచి 15 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండేది కాదు. పైగా లోఓల్టేజీ అతి పెద్ద సమస్య. వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పంటలు ఎండిపోయి రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
ముఖ్యంగా వేసవి వచ్చిందంటే కరెంటు ఉండే సమయం కంటే కోతలే అధికం. దాంతో ప్రత్యామ్నాయ బిజినెస్‌కు డిమాండ్ ఉండేది. ముఖ్యంగా ఇండ్లు, చిన్నచిన్న దుకాణాల్లో ఇన్వర్టర్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో జనరేటర్ల బిజినెస్ మూడు కాయలు ఆరు పువ్వులుగా కొనసాగేది. పట్టణాల్లో ఎక్కువ శాతం ప్రజలు కరెంటు కోతలను భరించలేక ఇన్వర్టర్లను ఆశ్రయించే వారు. ప్రస్తుతం నడి వేసవిలో సైతం ఇన్వర్టర్ల చర్చే కనిపించడం లేదు. నిరంతర విద్యుత్తు సరఫరా అందుకు కారణం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం సగటున 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను సైతం కొనసాగిస్తున్నారు. మరో పదిహేను రోజుల్లో విద్యుత్ వాడకం మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో 17.6మిలియన్ యూనిట్ల సగటు వాడకం ఉండగా తాజాగా అదనంగా నాలుగున్నర మిలియన్ యూనిట్ల అవసరం పెరిగినా నిరంతరం సరఫరా కొనసాగుతూనే ఉంది. గతేడాది ఇదే సమయంలో 18 నుంచి 20 మిలియన్ యూనిట్లు వినియోగించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వేసవిలో ఎండవేడిమి దృష్ట్యా ఏటా కరెంటు వినియోగం పెరుగుతూనే ఉంది.
ముఖ్యంగా కూలర్లు, ఏసీల వినియోగం సర్వసాధారణంగా మారింది. గతంలో పట్టణాల్లో ఆర్థికంగా స్థితిమంతులైన వారి ఇండ్లకే పరిమితమైన ఏసీలు ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలతో పాటు గ్రామాల్లోకి సైతం విస్తరిస్తున్నాయి. గ్రామాల్లో సైతం నాణ్యమైన త్రీఫేజ్ కరెంటు అందుబాటులో ఉండడంతో ఏసీలు ఉపయోగిస్తున్నారు. కూలర్లు కూడా పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చాయి. ఫ్యాన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఎండ తీవ్రతకు బయటకు వెళ్లడానికి జంకుతున్న ప్రజలు ఇండల్లోనే సేదతీరుతూ టీవీలు, ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ సమయంలోనూ కరెంటు వాడకం పెరుగుతున్నది.
ఇవన్నీ వాడుతున్నా ఎక్కడా, ఎలాంటి ఆటంకాల్లేకుండా కరెంటు సరఫరా జరుగుతున్నది. స్థానికంగా చిన్నచిన్న ఆటంకాలు మినహా కరెంటు కోతలు అనే సమస్య లేకుండా పోయింది. స్థానికంగా లైన్ క్లియరెన్స్, ఇతర మరమత్తుల సమయంలో సరఫరాకు ఆటంకం కలుగుతున్నా… అది కూడా ముందస్తుగా ప్రకటిస్తుండడం విశేషం. గృహాలతో పాటు దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు సైతం నిరంతరం కరెంటు సరఫరా అవుతుంది.
దాంతో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. గతంలో కరెంటు కోతలతో దుకాణాల్లో కూర్చోలేక వ్యాపారస్తులు కూడా మధ్యాహ్నం మూసేసేవారు. ఇన్వర్టర్లు, జనరేటర్లపై ఆధారపడే వారు. వీటి కోసం తమ సంపాదనలో అదనంగా వెచ్చించాల్సి వచ్చేది. జనరేటర్లలో వాడే డీజిల్, ఇతరత్రా ఖర్చులతో వేసవిలో వచ్చే లాభాల్లో కోత పడేది. ఇక కుటీర పరిశ్రమలు సైతం వేసవిలోనూ సులువుగా రన్ అవుతున్నాయి. వ్యాపార కార్యకలాపాలకు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. అదనపు ఖర్చులు తగ్గిపోయాయి. ఇక మరోవైపు చిన్న వ్యాపారులు సైతం ఏసీలు, కూలర్లు వాడుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కేవలం సీఎం కేసీఆర్ సంకల్పంతోనే సాధ్యమైందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
రోజురోజుకూ ఎండలు మండి పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా గ్రామంలో కరెంటు కోతలు లేకపోవడం సంతోషకర విషయం. ఒకవైపు ఎండలు మండుతున్నా కూలర్ వేసుకుని మగ్గం నేస్తుండటంతో ఎంత పనిచేస్తున్నా ఇబ్బంది ఉండట్లేదు. గతంలో ఎండా కాలం వచ్చిందంటే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మగ్గం నేసేవాళ్లం కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా రాష్ర్టాల్లో విద్యుత్ సంక్షోభం ఉన్నా మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకపోవడం ప్రభుత్వం గొప్పతనం.
– గంజి మధు, చేనేత కార్మికుడు,శాబ్దుల్లాపురం, కనగల్
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతల కారణంగా అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డమో ఇప్పుడు మాత్రం అంత ఆనందపడుతున్నాం. కరెంట్ కోతలు లేవు, వ్యవసాయ, గృహ, పారిశ్రామిక అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిపడ్డామో ఇప్పుడు అంతగా ఆనంద పడుతున్నాం.
– గజ్జెల శ్రీనివాస్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు. తిరుమలగిరి సాగర్
ఎండలు మండిపోతున్నాయి. ఏసీలు, ఫాన్లు వేసుకుంటే తప్ప ప్రాణాలు కుదుటపడే పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఏడాది ఎండలు, వేడి భరించలేకుండా ఉన్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుంది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని 24 గంటల విద్యుత్ వస్తుంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాం. పక్క రాష్టాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు పడే బాధలు పేపర్లలో చూస్తున్నాం. కానీ, కేసీఆర్ పుణ్యమా అని మన దగ్గర జనం హాయిగా సేద దీరుతున్నరు.
– మంజుల, గృహిణి, మీర్‌బాగ్‌కాలనీ, నల్లగొండ
దేశంలోనే కరెంటు కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు తెచ్చుకుంది. నిరంతర విద్యుత్ సరఫరాలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచింది. వేసవిలో మిగతా రాష్ర్టాల్లో కరెంటుకోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మన రాష్ట్రం మాత్రం పక్క రాష్ర్టాలకు కరెంటు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం గర్వించదగ్గ విషయం. ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రణాళికలే మనకు శ్రీరామ రక్ష.
– దుగ్గెబోయిన రామకృష్ణ, చిలుకూరు
ఎండాకాలంలో కూడా ఫుల్ కరెంటు ఇస్తున్నరు. బయట ఎండలు మండిపోతున్నయి. అందుకే ఇంట్లో నుంచి బయటకు పోతలేం. ఫ్యాన్ కిందనే ఉంటున్నం. కేసీఆర్ సార్ రాకముందు ఎండాకాలం వచ్చిందంటే బావుల కాడ, ఇండ్ల ముందున్న చెట్ల కింద ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడనే కూసునేది. కేసీఆర్ సారు ఫుల్ కరెంటు ఇస్తున్నరు. మేము, మా మనుమళ్లు, మనుమరాళ్లు అంతా ఫ్యాన్ల కిందనే ఉంటున్నం. కరెంటు విషయంలో కేసీఆర్ సారును రోజూ గుర్తు చేసుకుంటున్నం.
– బాతుక కమలమ్మ, భువనగిరి
ఈ ఏడాది ఎండలు బాగా ఉండడంతో ఉబ్బరింపు భరించలేక పోతున్నాం. కరెంటు ఉంటుంది కాబట్టి సల్లబడ్డదాక ఇంట్లనే కూలర్ ముందు కూసుంటున్నం. ఐదారేండ్ల కిందట కరెంటు సరిగ్గా ఉండక అగడుకి చెట్లకింద కూర్చునేటోళ్లం. కేసీఆర్ వచ్చినంక కరెంటైతే పోతలేదు. నాలాంటి ముసలోళ్ల పానం హాయిగుంటుంది.
– పాశం సత్తమ్మ, చండూరు
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన కాన్నుంచి గ్రామాల్లో కరెంటుకోత అనే మాటే వినపడట్లేదు. గత ప్రభుత్వాల హయాంలో కరెంటుకోతలతో చాలా ఇబ్బంది పడే వాళ్లం. పాలకవీడు లాంటి మారుమూల ప్రాంతాల్లో వేసవిలో ఉదయం 6 గంటలకు పోయిన కరెంటుమళ్లీ సాయంత్రం 6 గంటల తర్వాతనే వచ్చేది. పొద్దంతా ఉక్కపోతతో పిల్లలు, పెద్దలు చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు కరెంటుకోత అంటేనే మర్చిపోయాం. ఇందంతా సీఎం కేసీఆర్ చలువే.
– ఎరెడ్ల పుష్పలత, గృహిణి, పాలకవీడు
నెల రోజులుగా భగ్గుమంటున్న ఎండలు, ఉక్కపోతలకు ఇంట్లో ఫ్యాన్ల కిందనే ఉంటున్నాం. తెలంగాణ రాక ముందు పగటీలు అసలు కరెంటు ఉండకపోతుండె. ఐదారేండ్ల సంది కరెంటు మంచిగ ఇస్తున్నరు. ఉబ్బ ఎక్కువ ఉందని సాయంత్రం దాకా కూలరు పెట్టుకుంటున్నాం. కేసీఆర్ సార్ రావడం వల్లనే కరెంటు కష్టాలు పోయినయని మా ఊళ్లో అందరూ అనుకుంటున్నరు. సారు దయ వల్ల నాలాంటి ముసలోళ్లు, చిన్నపిల్లలు ఈ ఎండలకు తట్టుకొని బతుకుతున్నరు.
– రామిశెట్టి బుచ్చమ్మ, సీతారాంపురం, హుజూర్నగర్ రూరల్
ఇంట్లో 24 గంటలు కరెంటు ఉంటున్నది. గతంలో ఎండ కాలంలో గంటల తరబడి కరెంట్ తీసేయడంతో ఇబ్బందులు పడేవాళ్లం. పగలు కరెంట్ పోవడంతో ఉక్కపోతతో బయట చెట్ల కింద కూర్చునేవాళ్లం. రాత్రి సమయాల్లో కంటికి నిద్రలేకుండా పోయేది. గతంలో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా కోత విధించే వారు. ఎండకాలం వచ్చిందంటే ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియకపోయేది. సీఎం కేసీఆర్ ఎండాకాలంలో కూడా 24గంటలు కరెంటు కోత విధించకుండా నిరంతరం సరఫరా చేస్తున్నడు.
– దాసరి యాదగిరి, కట్టంగూర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటుకోతలతో అల్లాడినం. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అమావాస్య చీకట్లను చీల్చుతూ 24గంటలు కరెంటుఇస్తున్నారు. విద్యుత్ సరఫరా విషయంలో యావత్ భారతదేశం తెలంగాణ వైపే చూస్తున్నది. గత ప్రభుత్వాల పాలనలో కరంట్ కోతలు ఉండేవి. వేసవి వచ్చిందంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరెంట్ పోయేది. కరంటుపై ఆధారపడి నడిచే వ్యాపారాలు మూతపడేవి. జనం ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయేవారు. ఇప్పుడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా 24గంటల కరంట్ అందిస్తుండడంతో కూలర్లు, ఎసీలతో ప్రజలంతా సేద తీరుతున్నారు.
– ఎండీ.షమీమ్ సుల్తానా, సూర్యాపేట