ముస్లింల ప్రధాన పండుగైన రంజాన్ వచ్చేసింది. సోమవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ఈద్-ఉల్-ఫితర్‌కు ఊరూవాడ సిద్ధమైంది. ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గాహ్లు ముస్తాబయ్యాయి. ఎక్కడికక్కడ ముస్లిం మత పెద్దలు, పీస్ కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పాటించిన ఉపవాస దీక్షలను ముస్లింలు విరమించారు. ఇక.. గంగా జమునా తెహజీబ్ లాంటి మన సంస్కృతిలో నిన్నటి దాకా హలీమ్ రుచులు గుమగమలాడగా, ఈరోజు షీర్‌కుర్మా అందరి
నోరూ తీపి చేయనున్నది.
నెల రోజులుగా చేసిన ఉపవాసాలు విరమించిన సందర్భంగా పేదలకు చేసే దానాన్ని ‘ఫిత్’్ర అంటారు. ఏదైనా మంచి పనిని ప్రారంభించినప్పుడు అది దిగ్విజయంగా పూర్తయితే ఉత్సాహంతోపాటు ఆనందం కలుగుతుంది. ఆ పని పూర్తి కావడానికి అవకాశం కల్పించిన భగవంతునిపై కృతజ్ఞతాభావం కలుగుతుంది. ఆ సందర్భంలో దేవుడిని స్థుతిస్తూ ఈద్ నమాజ్ చేస్తారు.
రంజాన్ సందర్బంగా నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గాహ్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ప్రార్థనల్లో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపనున్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధి బాషానాయక్తండా వద్ద ఉన్న ఈద్గాహ్ ప్రార్థనలకు సిద్ధమైంది. సుమారు 15 నుంచి 20 వేల మంది ముస్లింలు ప్రార్థనలకు హాజరయ్యే అవకాశం ఉండడంతో టెంట్లు, కుర్చీలు, నీటి వసతి ఏర్పాటు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రార్థనలకు హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలుపనున్నారు.
రంజాన్ పండుగ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు మెరుగైన జీవన శైలిని అందిస్తాయి. అత్యంత పవిత్ర పర్వదినంగా భావించే ఈద్ ఉల్ ఫితర్‌ను సంతోషంగా జరుపుకోవాలి. అందరికీ అల్లా దీవెనలు ఉండాలి. గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రం లౌకికవాదం, మత సామరస్యం కాపాడడంలో తెలంగాణ రాష్ట్రం భారత దేశానికే ఆదర్శంగా నిలిచింది. మైనారిటీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నది.
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
ప్రత్యేక ప్రార్థనలు
రంజాన్ పూట వేకువ జామునే లేచి ఫజర్ నమాజ్ ఆచరించి షీర్‌ఖుర్మాతో నోరు తీపి చేసుకుంటారు. నూతన వస్ర్తాలు ధరించి సుర్మా, అత్తరు అద్దుకుని, పండుగ నమాజ్ ఆచరించేందుకు ఈద్‌గాహ్‌లకు వెళ్తారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అనంతరం ఖబరస్తాన్కు వెళ్లి గతించిన తమ కటుంబ సభ్యులు, పెద్దలకు నివాళులు (దురూద్) అర్పిస్తారు. అక్కడి నుంచి తమ బంధువులు, మిత్రుల ఇండ్లకు వెళ్లి ఈద్ ముబారక్ తెలుపుతారు. ఆ తర్వాత తమ ఇంటికి చేరుకుని పండుగ సందర్భంగా తయారు చేసుకున్న ప్రత్యేక వంటకాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తారు.
రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం మార్కెట్లు సందడిగా మారాయి. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లా కేంద్రాలతోపాటు మిగతా పట్టణాల్లో కొత్త బట్టలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, ఇతర పండుగ సామగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడాయి. హలీమ్ విక్రయాలకు చివరి రోజు కావడంతో సోమవారం సాయంత్రం జనం భారీగా తరలివచ్చి కొనుగోళ్లు చేశారు.
కేతేపల్లి, మే 2 : మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పండుగలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ అన్ని మతాల ప్రధాన పండుగలకు ఉచితంగా బట్టలు అందజేయడంతోపాటు విందు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మసీదులు, ఖబరస్తాన్‌ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. షాదీముబారక్ ద్వారా ఆడబిడ్డలకు పెండ్లిళ్లకు కట్నం అందిస్తున్నదని తెలిపారు. విదేశాల్లో చదువుకునే ముస్లిం విద్యార్థులకు రూ. 20 లక్షల సాయం చేస్తున్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కె ట్ వైస్ చైర్మన్ కె.సైదిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బడుగుల శ్రీనివాస్‌యాదవ్, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, నాయకులు మారం వెంకట్‌రెడ్డి, సీహెచ్.వెంకన్నయాదవ్, కె.ప్రదీప్‌రెడ్డి, కె.శ్రవణ్‌కుమార్, షేక్ రషీద్, సయ్యద్ ఫరీద్, యూసుఫ్, ఆర్.సైదులుగౌడ్, వి.చేతన్, సత్యనారాయణ పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్, మే 2 : అన్ని మతాలు, సంస్కృతి, సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో తన సొంత ఖర్చులతో ముస్లింలకు ఇంటింటికీ వెళ్లి రంజాన్ పండుగ సరుకులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని మతాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్ని మతాల ప్రధాన పండుగల సందర్భంగా పేదలకు ప్రభుత్వమే ఉచితంగా బట్టల అందజేతతోపాటు విందు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు ముదిరెడ్డి సంతోష్‌రెడ్డి, నాయకులు మాలి అనంతరెడ్డి, ఈదుల యాదగిరి, పులగం రాఘవరెడ్డి, మామిడి తిరుమళ్, రహమతుల్లా ఖాన్ పాల్గొన్నారు.