నల్లగొండ రూరల్, మే 1 : సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన ర్యాంకుల్లో నల్లగొండ మండలంలోని బుద్ధారం గ్రామం చోటు దక్కించుకున్నది. దేశ వ్యాప్తంగా 19వస్థానంలో నిలిచింది. ప్రతి పార్లమెంటు సభ్యుడూ ఏటా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎంపీ నిధులను కేటాయించి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడం ఈ పథకం ఉద్దేశం. అభివృద్ధి ప్రణాళికను గ్రామస్తులే రూపొందించుకుని, లక్ష్యసాధన మార్గాలను సైతం నిర్ణయించుకుంటారు.
ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధి, మెరుగైన జీవన విధానాన్ని సాధించడం, అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడటం ఈ పథకం లక్ష్యం. దేశ వ్యాప్తంగా ఎంపీలు దత్తత తీసుకొన్న గ్రామాలకు మార్కులు కేటాయించగా అప్పటి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దత్తత తీసుకున్న బుద్ధారం 87.81పాయింట్లతో 19వ స్థానంలో నిలిచింది. పల్లె ప్రగతిలో దిక్సూచి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో బుద్ధారం దేశానికే దిక్సూచిగా నిలిచింది. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డు, నర్సరీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణలో పంచాయతీ ట్రాక్టర్, ట్రాలీల వినియోగం తదితర అంశాలను డీఆర్డీఏ అధికారులు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వానికి సమర్పించారు.
సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై) పథకం అమలులో బుద్ధారం గ్రామం 19వ ర్యాంకు సాధించడం జిల్లాకు గర్వకారణం. సీఎం కేసీఆర్ విజన్‌కు ఈ ర్యాంకు నిదర్శనం. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితోనే ఇది సాధ్యపడింది. ఆనాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– బకరం యాదమ్మ, సర్పంచ్, బుద్ధారం
రామగిరి, మే 1 : అభ్యుదయ రచనలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తాయని, సమాజాన్ని మేల్కొల్పుతాయని అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. ప్రముఖ కవి బి.రాములు రచించిన ‘శిరసెత్తిన’ కావ్య పుస్తకాన్ని నల్లగొండలోని చినవెంకట్‌రెడ్డి మినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డీఎంహెచ్ఓ డా.కొండల్రావు, విశ్రాంత ఐఏఎస్ ప్రభాకర్, కవులు మేరెడ్డి యాదగిరిరెడ్డి, డా.పగడాల నాగేందర్, కృష్ణ కౌండిన్య, మునాస్ వెంకట్, అంజయ్య పాల్గొన్నారు.
చివ్వెంల, మే 1 : తెలంగాణ వారసత్వ శాఖ అధికారి, నల్లగొండ జిల్లా పానగల్లు ఆర్కియాలజీ మ్యూజియం ఇన్చార్జి సోమశంకర్‌రెడ్డి ఆదివారం ఉండ్రుగొండ గిరి దుర్గాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొలువు సావిడి, రామస్వామి ఆలయ శిథిలాలు రక్షిత, స్మారక చిహ్నాలుగా గుర్తించి వాటి రక్షణ కోసం బోర్డులు ఏర్పాటు చేశారు. చారిత్రక సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉన్నదని పేర్కొన్నారు.
ఉండ్రుగొండ కటకం రాజధానిగా చేసుకుని కొలువు చావిడిలో మంత్రులు, సామంతులు, కరణాలు, సైన్యాధిపతులతో సభ జరిపి కొలువు సాగర్ నుంచి వివిధ గానాలు చేసినట్లుగా వెలిచెర్ల శాసనాల్లో ఉన్నాయని తెలిపారు. కట్టడాలన్నీ రామస్వామి దేవాలయ నిర్మాణాలని, వివిధ రాజులు కొలువు సావిడిని రాజ్యసభగా వాడుకున్నారని శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉండ్రుగొండ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ డాక్టర్ రామయ్య, చింతల మల్లయ్య, మహేశ్వరం రవి, సంతోష్, భరద్వాజ, ఉండ్రుగొండ టూరిజం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఉండ్రుగొండ, ధర్మాపురం గ్రామస్తులు పాల్గొన్నారు.