నీలగిరి, ఏప్రిల్ 30 : రైతులకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై ఇప్పిస్తామని వారి వద్ద డబ్బులు వసూలు చేసి పరికరాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. డ్వామాలోఉపాధి హమీ పథకంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియామకమైన నూకల నాగరాజు వాటర్‌షెడ్ అసిస్టెంట్‌గా సుమారు ఐదేండ్ల పాటు తిప్పర్తి మండలంలో పనిచేశాడు. దీంతో నాగరాజుకు తిప్పర్తి మండల రైతులతో సంబంధాలు పెరి గాయి. కొంతమంది రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు ఇప్పించి కొంత కమీషన్ తీసుకునేవాడు. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం పథ కాన్ని ఎత్తివేసింది. దీంతోపాటు ఆ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను కూడా తొలగించింది.
అయినప్పటికీ నాగరాజు గతంలోని గుర్తింపు కార్డు చూపించి సింగం సైదులు, ఉప్పునూతల నాగరాజు, కొండ సైదులు, బోధనపు మధుసూదన్‌రెడ్డి, బోయిన సైదులు, బాత్క సైదులు, చింతకాయల సంతోష్‌లను ఏజెంట్లుగా చేసుకుని నేరేడుచర్ల, వేములపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి, నల్లగొండ, కనగల్, గుర్రంపోడు, పెద్దవూర, నిడమనూరు, అనుముల, నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం, చౌటుప్పల్, చిట్యాల మండలాల్లోని 79 గ్రామాలకు చెందిన 498 మంది రైతుల నుంచి వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తామని నగదు వసూ లు చేశారు. ఇందులో కొద్దిమంది ఒత్తిడి చేసిన రైతులకు నల్లగొండ, మిర్యాలగూడ ఏజెన్సీల నుంచి పరికరాలు కొనుగోలు చేసి సబ్సిడీపై ఇస్తున్నట్లు చేప్పేవాడు.
ఇలా రెండేండ్లుగా 498మంది రైతుల నుంచి సుమారు రూ. 3.83 కోట్లు వసూలు చేసి రూ. 2.83 కోట్లు వ్యవసాయ పరికరాల కోసం ఖర్చు చేశాడు. మిగిలిన కోటి రుపాయలను వారు వాడుకున్నట్లు తెలిపారు. దీనిపై తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన బసవోజు నాగబ్రహ్మచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, శాలిగౌరారం సీఐ రాఘవరావు, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజశేఖర్, తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణలను ఎస్పీ అభినందించారు.
ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. శనివారం తెల్లవారుజామున మిర్యాలగూడ రాజీవ్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై ఇద్దరు అనుమానస్పందంగా కనిపించడంతో విచారించారు. వాహనం సీటుకింద బంగారు హారం, మూడు ఉంగరాలు లభ్యమయ్యాయి. వాటి వివరాలు అడుగగా తడబడుతూ పారిపోయే ప్రయత్నం చేయడంతో అదుపులోకి తీసుకోగా మిర్యాలగూడకు చెందిన కొత్తపల్లి మధు పెయింటర్‌గా, శాగంటి మహేష్ ఆటోడ్రైవర్‌గా పనిచేసేవారు.
వారికి వచ్చిన డబ్బులు సరిపోక దొంగ తనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. 2021 నవంబర్ నుంచి మిర్యాలగూడతోపాటు వాడపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 15 ఇండ్లలో వారు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. వారి వద్ద సుమారు 23 తులాల బంగా రం, 730 గ్రాముల వెండి, రూ. 12 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ శ్రీనివాస్, వన్‌టౌన్ ఎస్ఐ సుధీర్‌కుమార్, పీసీలు వెంకటేశ్వర్లు, నాగరాజులను ఎస్పీ అభినందించారు.