ఎండలు మండిపోతున్నాయి. వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు జనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చల్లటి నీటి కోసం మట్టి కుండలు, ఎండ తగులకుండా గొడుగులు వాడుతున్నారు. అయితే, మరి పశువులు, మూగజీవాల పరిస్థితి ఏంటి? గతేడాదితో పోలిస్తే ఈ సారి ఏప్రిల్ నెలలోనే అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పశువులు, జీవాల ఆరోగ్యం పట్ల యాజమాన్యం జాగ్రత్తగాఉండాలని పశు సంవర్ధక శాఖ సూచిస్తున్నది.
– నల్లగొండ, ఏప్రిల్ 30
వేసవి తాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతున్న నేపథ్యంలో సులువుగా జీర్ణించుకునే గంజి, జావ లాంటి పిండి పదార్థాలతోపాటు ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఉదయం పచ్చి గడ్డి, రాత్రి సమయాల్లో ఎండు గడ్డి విభజించి ఇస్తే ప్రయోజనం ఉంటుంది. పాలిచ్చే పశువులకు పశుదాణా నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్ ఉప్పు కలిపిన ద్రావణం అందించాలి. పశువుల్ని ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బయటకు పంపడం మంచిది. పశువులకు చల్లటి నీరు అందేలా చర్యలు తీసుకోవాలి. పశువులు, గొర్రెలు, మేకల్లో గాలి కుంటు, గొంతు వాపు, జబ్బ వాపు లాంటి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. కృత్రిమ గర్భధారణ వల్ల ముర్రా జాతికి సంబంధించిన పశువులు ఎక్కువగా జన్మించాయి. ఈ రకం పశువులు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ఎండకు బలహీన పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తప్పనిసరి. గొర్రెలు, మేకలు, కోళ్లుసైతం అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. వడదెబ్బ బారిన పడితే సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలి.
వేసవి ముగిసే వరకు పశువులు, మూగజీవాల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా కాపాడుకోవాలి. అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగ్గా లేక పోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి పోవడం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడ వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి బలహీనంగా మారుతాయి. పశువులు సరిగ్గా నడువలేక తూలుతూ పడిపోతాయి. జీవ క్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఇతర వ్యాధులు, పరాన్న జీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణ కోశ వ్యాధులు వస్తాయి. చూడి పశువుల్లో గర్భస్రావం, వడదెబ్బకు గరైన వాటిలో దాహం పెరుగడం, తూలుతూ నడుస్తూ పడిపోవడం, రొప్పుతూ ఉండటంతో పాటు శ్వాస కష్టమై ఒక్కో సారి అపస్మారకస్థితికి వెళ్లి మృత్యువాత పడే ప్రమాదం ఉన్నది.
వడ దెబ్బకు గురైన పశువులకు ప్రథమ చికిత్స చేయించాలి. వాటిని చల్లని గాలి వీచే ప్రాంతానికి తరలించి శరీర ఉష్ణోగ్రత తగ్గించటానికి పలుమార్లు నీటితో కడిగి తల, నుదుట మంచు ముక్కలు పెట్టి చల్లని గోనె సంచిని కప్పి పశువైద్యులకు సమాచారం అందించాలి. వైద్యుడి సహకారంతో గ్లూకోజ్ స్లైన్, సోడియం క్లోరైడ్ అందించడంతో పాటు శరీర ఉష్ణోగ్రత తగ్గే వరకు అవసరమైన చికిత్స చేయాలి.
ప్రస్తుతం ఎండ ప్రభావం తీవ్రంగా ఉన్నందున పశువులు, జీవాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మేత విషయంలో పచ్చి గడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రెండు నెలలు పశువులు, జీవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
– శ్రీనివాస రావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, నల్లగొండ