ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో భూముల ధర బంగారంతో పోటీ పడుతున్నది. హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో గజం ధర రూ.40వేలు కాగా, ఆత్మకూర్(ఎం)లో రూ.50వేలు ఉండడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో మండల కేంద్రం ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కువ శాతం ప్రజలు భూములు, ఇండ్లు కొనుగోలు చేయడం కోసం ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ కేవలం 60కిలోమీటర్లు, యాదాద్రికి 30కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడంతో రియల్ భూమ్ నడుస్తున్నది.
సుమారు 60ఏండ్ల కిందట భువనగిరి నుంచి ఆత్మకూరు(ఎం) మీదుగా అడ్డగూడూరు వరకు రోడ్డు ఏర్పడింది.
అప్పట్లో ప్రధాన రోడ్డు వెంట ఎటు చూసినా చెట్ల పొదలు, చిరు ధాన్యాల పంట చేలు దర్శనమిచ్చేవి. తొలిసారిగా 1978లో ఆత్మకూరు(ఎం)లో మోత్కూరు-భువనగిరి రోడ్డుపై 20 మంది ఇండ్లు కట్టుకున్నారు. అప్పట్లో గజం ధర రూ.15మాత్రమే. కాల క్రమంలో రవాణా సౌకర్యం పెరుగడంతో 1990 సంవత్సరంలో మరికొంత మంది గజం రూ.80 చొప్పున స్థలాలు కొని ఇండ్లు కట్టుకున్నారు. ఆ తర్వాత 2006లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు కావడంతో గజం రూ.2500 నుంచి 3500కు పెరిగింది. స్వరాష్ట్రంలో మండలంలోని చుట్టపక్కల గ్రామాల రైతులు, వ్యాపారులు మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు వెంట ఇండ్ల స్థలాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ప్రస్తుతం వ్యవసాయ భూమి ధర ఎకరం రూ.50లక్షలు, కమర్షియల్ బిట్ ఎకరాకు రూ.3కోట్లకు పైనే పలుకుతున్నది.
ఎకరం రూ.50లక్షల ధర పలుకుతుండడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ భూములను అమ్ముకొని మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు వెంట ఉన్న స్థలాన్ని కొనుగోలు చేస్తున్నారు. పోటీ పెరుగడంతో గజం రూ.40 వేల నుంచి 50వేల వరకు పలుకుతున్నది. భవనాల నిర్మాణంతో వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వ్యాపారులు వలస వచ్చి దుకాణాలను ఏర్పాటు చేశారు.
1978 సంవత్సరంలో మెయిన్ రోడ్డు పక్కన 15రూపాయల చొప్పున 600 గజాల స్థలాన్ని కొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఇదే స్థలం గజం రూ.50వేల వరకు పలుకుంది. రోడ్డు డెవలప్ చేయడంతోపాటు రవాణా సౌకర్యం పెరుగడంతో రియల్ ఎస్టే వ్యాపారులు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. ప్లాట్లను కొని మళ్లీ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
– కోరె భిక్షపతి, రైతు, ఆత్మకూరు(ఎం)
గతంలో వ్యాపారులు బంగారం కొని పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు అదే డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నరు. రోజురోజుకూ ధరలు పెరుగుతుండడంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ప్లాటు కొని పెట్టుకుంటున్నరు. చాలా మంది బంగారం కంటే కూడా భూములు కొంటున్నరు. రైతులు కూడా వ్యవసాయ భూములు అమ్ముకొని ఇండ్ల స్థలాలు కొంటున్నరు.
– నాతిరాజు, ఆత్మకూరు(ఎం)
మోత్కూరు-భువనగిరి రోడ్డు పక్కన భూములకు భారీ స్థాయిలో ధరలు పెరిగాయి. రియల్ ఎస్టే వ్యాపారులు ముందుగానే భూములను కొనుగోలు చేసి వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముతున్నరు. యాదాద్రి దేవాలయం అభివృద్ధి చెందడంతో ఆత్మకూరు(ఎం)లో ఇంటి స్థలాల కొనుగోలు పెరిగింది.
– అంబోజు శ్రీనివాస్, ఆత్మకూరు(ఎం)