అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ దిశగా చర్యలు తీసుకుంటున్న అటవీ శాఖ.. ప్రకృతి అందాలను పర్యాటకులకు చేరువ చేస్తున్నది. వన్యప్రాణుల సంరక్షణకు నిరంతర నిఘా కొనసాగిస్తూనే పర్యాటకులను అటవీ ప్రాంతంలోకి ఆహ్వానిస్తున్నది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో నెల్లికల్ సమీపంలోని 250 ఎకరాల్లో అర్బన్ పార్కు, గజీబా, వ్యూపాయింట్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసింది. పనులు తుదిదశలో ఉన్నాయని, మరో ఐదు నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తామని అటవీ అధికారులు వెల్లడించారు.
– నందికొండ, ఏప్రిల్ 28
పర్యాటకుల రాకతో అడవులు, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలుగకుండా చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో పార్కు చుట్టూ రెండు కిలో మీటర్ల దూరంలో ఐరన్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. నెల్లికల్ ఫారెస్ట్‌లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చడానికి 25 నీటి తొట్లను నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మరోవైపు అటవీ కోర్ ఏరియాలో 20 వేల మొక్కలను నాటారు. మరో 20 వేల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మియావాకి పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో 4వేల మొక్కలను నాటి చిట్టడవికి శ్రీకారం చుట్టారు.
అటవీ ప్రాంతంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ఎంట్రెన్స్ ప్లాజా, 50 మంది కూర్చుని భోజనం చేసేలా గజీబా, ప్రకృతి అందాలను వీక్షించడానికి వ్యూ పాయింట్ నిర్మించారు. పర్యాటకుల కోసం వాష్ రూమ్‌లు, తాగునీటి వసతి, వాహనాలు రావడానికి రోడ్ల పనులు జరుగుతున్నాయి.
అటవీ ప్రాంతంలో స్వచ్ఛమైన గాలి, పచ్చని కొండల మధ్య కనువిందు చేసే ప్రకృతి అందాలు పర్యాటకులకు మధురానుభూతి కలిగించనున్నాయి. పర్యాటక పరంగా రూ.కోటిన్నర వ్యయంతో అర్బన్ పార్కు, గజీబా, వ్యూపాయింట్, రోడ్లను ఏర్పాటు చేశాం. వన్య ప్రాణుల సంరక్షణ కోసం నీటి తొట్లను నిర్మించాం. అడవుల సంరక్షణలో భాగంగా మొక్కలను నాటుతున్నాం. అతి త్వరలో పనులు పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– సర్వేశ్వర్, ఫారెస్ట్ డివిజన్ అధికారి