ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి రానున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి దశదిన కర్మలో పాల్గొనేందుకు వస్తున్న ముఖ్యమంత్రి ముందుగా పట్టణ సమీపంలోని రాశీరిఫ్యాక్టరీస్ పక్కన ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమానికి హాజరై చిరుమర్తి నర్సింహకు నివాళులర్పించనున్నారు.
అనంతరం నార్కట్‌పల్లిలోని ఎమ్మెల్యే చిరుమర్తి నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా సంతాప కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిసింది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రెమారాజేశ్వరి బుధవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్27 (నమస్తే తెలంగాణ) నార్కట్‌పల్లి : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ దశదిన కర్మలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ గురువారం నార్కట్‌పల్లికి రానున్నారు. కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా తరలివచ్చే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులకు వేర్వేరుగా ప్రత్యేక కౌంటర్లు పెట్టి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా బాధ్యులను నియమించి పర్యవేక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ కోసం జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తునది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి సీఎం పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. గురువారం స్థానిక రాశి రిఫ్రాక్టరీస్ కంపెనీ పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, సంతాప సభను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పరిశీలించారు. హెలీప్యాడ్, సంతాప సభ వద్ద బారికేడింగ్, వీఐపీ భద్రత, విద్యుత్ సరఫరా, సంతాప సభ వేధిక ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు.
పట్టణంలోని చిరుమర్తి లింగయ్య ఇంటికి వెళ్లే రూట్‌తో పాటు పార్కింగ్ ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా వాహన పార్కింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. సీఎం చిరుమర్తి ఇంటికెళ్లే రూట్లో ఇతర వాహనాలు రాకుండా వాటిని వేరే రూట్లో మళ్లించాలని నిర్ణయించారు. దారి పొడవునా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
సీఎంతో పాటు పెద్దకార్యం కార్యక్రమానికి భారీగా నేతలు, ఇతర ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రత, ఇతర ఏర్పాట్లపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీఎం పర్యటన సజావుగా సాగేలా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
బందోబస్తులో పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారందరికీ విధుల నిర్వహణకు సంబంధించిన సూచనలు చేశారు. బాధ్యతగా, సమర్థవంతంగా విధులు నిర్వహించి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఈ విద్యాసాగర్, ఆర్ అండ్‌బీ ఈఈ నరేందర్‌రెడ్డి, అగ్నిమాక అధికారి నారాయణ, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, డీపీఆర్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.