రామగిరి, ఏప్రిల్ 22: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో కీలక భూమిక పోషించే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీల పదవీకాలం మే 31న ముగియనుండగా(జూన్ 1, 2022 నుంచి నవంబర్ 30,2022)వరకు పాత కమిటీలనే కొనసాగిస్తూ ఈనెల 20 న ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మెమో నెం 5030/SE-Prog. I/A2/2022తో ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ప్రస్తుతం ఎస్ఎంసీల పదవీ కాలం 2021, నవంబర్ 30తో ముగియగా కరోనా నేపథ్యంలో తమ సేవలు వినియోగించుకోలేకపోయామని కమిటీలు పేర్కొనడంతో వారి విజ్ఞప్తి మేరకు ఆరు నెలలు పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లోని తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. సీనియర్లను చైర్మన్, వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు. కమిటీల పదవీ కాలం రెండేండ్లు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఎంసీని నవంబర్ 30, 2019న ఎన్నుకోగా వీరి పదవీ కాలం నవంబర్ 30, 2021తో ముగిసింది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు నడవకపోవడంతో ఈ కమిటీలను మరో ఆరు మాసాలు మే 31,2022 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అ యితే ప్రస్తుతం వేసవి సెలవులు ఉండడంతో మరో ఆరు మాసాలు అంటే జూన్ 1, 2022 నుంచి నవంబర్ 30,2022 వరకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,111 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 1483, సూర్యాపేట జిల్లాలో 719, యాదాద్రి భువనగిరి జిల్లాలో 909 పాఠశాలలున్నాయి. వీటిలోని ఎస్ఎంసీలు నవంబర్ 30, 2022 వరకు కొనసాగనున్నాయి.
ఎస్ఎంసీల పదవీ కాలం మరో ఆరుమాసాలు పొడిగించడం సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు, హెచ్ఎం, గ్రామస్తుల సహకారంతో బడిలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నా. కమిటీ సభ్యులతో కలిసి పాఠశాల అభివృద్ధికి పనిచేస్తాం.
-ఎన్.సునీత, ప్రభుత్వ ఉన్నత పాఠశాల
జేబీఎస్, ఎస్ఎంసీ చైర్మన్, మాధవనగర్, నల్లగొండ.