
అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షం
చండూర్ మండలంలో అత్యధికంగా 8సెంటీ మీటర్లు
పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న శాస్త్రవేత్తలు
చేలల్లో ఎప్పటికప్పుడు నీటిని తొలిగించాలని సూచన
నల్లగొండ, ఆగస్టు 29 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నిత్యం మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతున్న వర్షం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా పడడంతో భారీ స్థ్దాయిలో వర్షపాతం నమోదవుతుంది. తొలి రెండు రోజులు కురిసిన వర్షాలు మెట్ట పంటలకు జీవం పోసినప్పటికీ ఆ తర్వాత సైతం కొనసాగుతుండడంతో అవే పంటలకు నష్టాన్ని తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో ప్రధానంగా 7.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనందున ఈ వర్షాలు ఆ పత్తి పంట జాలు వారి ఎర్రగా మారుతున్నాయి. దీంతో పాక్షిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది.ఎప్పటికప్పుడే పత్తి చేలల్లో నీటిని కాల్వల ద్వారా తొలగించాలని వ్యవసాయ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయమే వర్షం ప్రారంభం కాగా మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైంది. నల్లగొండలో ఆదివారం మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన వర్షం సాయంత్రం వరకు భారీగా కురిసింది. దీంతో కాలనీల్లో వరద పోటెత్తింది. పానగల్ బైపాస్ వద్ద వాహనాల రాకపోకలకు రెండో రోజు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం ఉద యం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చండూరు మండల కేంద్రం, పుల్లెంల గ్రామంలో అత్యధికంగా 8 సెంటీ మీటర్ల వాన పడినట్లు అధికారులు తెలిపారు. నల్లగొండ, త్రిపురారం, అడవిదేవులపల్లిలో నాలుగు సెంటీ మీటర్ల వర్షం పడగా మిర్యాలగూడలో 3.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఇక దామరచర్ల, నేరేడుగొమ్ము, అనుముల, తిప్పర్తి మండలాల్లో రెండు సెంటీ మీటర్ల వర్షం పడగా నిడమనూరు, మాడ్గులపల్లి, గుర్రంపోడు, పీఏపల్లి, పెద్దవూరలో సెంటీమీటర్ కురిసింది. ఇక మిగిలిన మండలాల్లో చిరుజల్లులు కురిశాయి.
38 శాతం అదనపు వర్షపాతం..
జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లోని సాధారణ వర్షపాతానికి మించి నమోదవుతున్న వర్షపాతం క్రమంగా పెరుగుతున్నది. జూన్ ఒకటి నుంచి ఆగస్టు 29 వరకు 354.4 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 490.0 మి.మీ. వర్షం పడడంతో 38 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం ఎనిమిది నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు అత్యధికంగా కట్టంగూర్ మండలంలో 46.4 మి.మీ. వర్షం పడగా మునుగోడులో 38.5 మి.మీ. నల్లగొండలో 33.7, చిట్యాలలో 26.2, నకిరేకల్‌లో 25.8, కేతేపల్లిలో 25.5, అనుములలో 19.9, తిప్పర్తిలో 19.6, శాలిగౌరారంలో 19.2, నిడమనూరులో 17.4, నార్కట్‌పల్లిలో 15.7, చండూర్లో 11.5, మర్రిగూడలో 8.6, మిర్యాలగూడలో 8.6, త్రిపురారంలో 6.8, మాడ్గులపల్లిలో 6.3, వేములపల్లిలో 6.3, అడవిదేవులపల్లిలో 6.0, గుర్రంపోడులో 5.4, దామరచర్లలో4.6, చింతపల్లిలో 4.3, నాంపల్లిలో 4.1, కనగల్‌లో 3.9, తిరుమల గిరి సాగర్‌లో 3.8, కొండమల్లేపల్లిలో 3.5, పెద్దవూరలో 3.4, పీఏపల్లిలో 2.5, నేరేడుగొమ్ములో 2.0, దేవరకొండలో 1.7, గుండ్లపల్లిలో 0.9 మి.మీ. వర్షం పడగా అత్యల్పంగా చందంపేటలో 0.8 మి.మీ. వర్షం కురిసింది. మొత్తంగా ఆయా మండలాల్లో 384.6 మి.మీ. వర్షం పడగా 12.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.
నీట మునిగిన పంట పొలాలు
తిరుమలగిరి/తుంగతుర్తి/నడిగూడెం: సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. వర్షాలతో చెరువులు, కుంటలు జలకళనుసంతరించుకున్నాయి. తిరుమలగిరి మం డలంలోని గుండె పురి పెద్ద చెరువు అలుగు పోస్తుంది. తుంగ తుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని కుంటలు, చెరువుల కింద ఉన్న రైతుల పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. నడిగూడెంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
తెగిన ఊట్కూర్-
నందికొండ వారి గూడెం రోడ్డు
నిడమనూరు : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో మండలంలో చెరువులు, వాగులు, కుంటలు ఉప్పొంగుతున్నాయి. ఊట్కూరు-నందికొండ వారి గూడెం గ్రామాల నడుమ ఉన్న లోలెవల్ కల్వర్టు మూడేళ్ల క్రితం కురిసిన వర్షానికి కుంగిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం రాకపోకల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డు వాగులో నీటి ప్రవాహ ఉధృతికి గండిపడి ఆదివారం కొట్టుకుపోయింది. దీంతో ఊట్కూరు నందికొండ వారిగూడెం గ్రామాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. ముప్పారం, నిడమనూరు, ఊట్కూరు, వెంకటాపురం, తుమ్మడం చెరువుల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది.
మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు ద్వారా ఆదివారం 2,152.95 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు గేట్ల ద్వారా 1,909.20 క్యూసెక్కులు, కాల్వలకు 142.83 క్యూసెక్కులు వెళ్తుండగా, 49.07 క్యూసెక్కులు ఆవిరవుతుంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,847..75 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46టీఎంసీలు)కాగా,ప్రస్తుతం 643. 12 అడుగులు(3.97 టీఎంసీలు)గా ఉంది.