
పార్కింగ్ చేసిన లారీల్లో డీజిల్ చోరీ
దారి దోపిడీ జాబితాల్లోకి డీజిల్
లీటరుకు రూ.వంద చేరడమే కారణం
మునగాలలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు
నిందితులంతా మహారాష్ట్రవాసులే
వివరాలు వెల్లడించిన డీఎస్పీ
మునగాల, ఆగస్టు 28 : జాతీయ రహదారి వెంట నిలిపిన లారీల నుంచి డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తెరికాడ్ గ్రామానికి చెందిన గణేశ్నాన కాలే, రాజేందర్ సాజిత్ కాలే, గులాబ్ కాలే, గణేశ్ పవార్, రామసుబ్రావ్ కాలే, కాలే రాజాసిందే, సాచిన్ చాగన్ కాలే ఓ ముఠాగా ఏర్పడి డీజిల్ దొంగతనాలకు అలవాటుపడ్డారు. రెండు కంటైనర్లు, 53 ఖాళీ డీజిల్ క్యాన్లతోపాటు లారీల నుంచి డీజిల్ తీసే పరికరాలతో ఈనెల 18న తెరికాడ్ నుంచి బయలుదేరారు. రాత్రిపూట రోడ్ల వెంట నిలిపిన లారీలను టార్గెట్ చేస్తూ డీజిల్ ట్యాంకుల తాళాలు పగులగొట్టి డీజిల్ దొంగిలించేవారని తెలిపారు. ఈక్రమంలో ఈనెల 22న నార్కట్‌పల్లి మండల పరిధిలో జాతీయరహదారి పక్కన ఆపిన లారీ నుంచి 300 లీటర్ల డీజిల్‌ను దొంగలించి సూర్యాపేటలో గుర్తుతెలియని వ్యక్తులకు రూ.30 వేలకు విక్రయించారు. 23న మునగాల మండలం ఇందిరానగర్‌లో రోడ్డు పక్కన నిలిపిన లారీ నుంచి 400 లీటర్ల డీజిల్‌ను క్యాన్లలో నింపుకొని వెళ్తున్నారు. ఈక్రమంలో తాడ్వాయి స్టేజీ వద్ద పోలీసుల తనిఖీలో లారీలో డీజిల్ క్యాన్లు ఉండటంతో అనుమానంతో వారిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతన్నట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి రెండు కంటైనర్లు, రూ.30 వేలు, ఫోన్, డీజిల్ తీసే పరికరం, 58 ఖాళీ క్యాన్లు, 11 డీజిల్ క్యాన్లు, గ్యాస్ పొయ్యి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. డీజిల్ దొంగతనానికి పాల్పడుతన్న వారిని చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సీఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.