
నల్లగొండ జీజీహెచ్‌లో రూ.కోటిన్నరతో ఏర్పాటు
డిజిటల్ ఎక్స్‌రే యంత్రం కూడా.. త్వరలోనే అందుబాటులోకి
ఇక 90 శాతం పరీక్షలు ఉచితంగానే.. వ్యాధి నిర్ధారణలో
కీలకమైన పరీక్షలు రోగికి భారంగా మారిన వేళ.. డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుతో 57 రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వైద్యంలో మరో కీలక ముందడుగు వేస్తున్నది. నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో రూ.కోటిన్నరతో సీటీ స్కాన్, 15 లక్షలతో డిజిటల్ ఎక్స్‌రే యంత్రాలను ఏర్పాటు
చేస్తున్నది. క్యాజువాలిటీని కూడా ఆధునీకరిస్తున్నది. రెండు మూడ్రోజుల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు చెప్తున్నారు. సీటీ స్కాన్ వినియోగంలోకి
వస్తే మార్కెట్లో రూ.7వేల రూపాయలున్న పరీక్షలు సైతం రోగులకు ఉచితంగా అందనున్నాయి.
నల్లగొండ జిల్లా దవాఖానలో కోటిన్నరతో ఏర్పాటు
నీలగిరి, ఆగస్టు 21 : సమైక్య పాలనలో సుస్తీ చేసిన ప్రభుత్వ వైద్యశాలలను బాగు చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. సబ్‌సెంటర్ల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు ఒక్కొక్కటిగా ఆధునీకరిస్తూ నిరుపేదలకు వైద్యాన్ని చేరువ చేస్తుంది. ప్రభుత్వ అసుపత్రులను బలోపేతం చేసిన సర్కారు.. వ్యాధి నిర్ధ్దారణ పరీక్షలు కూడా ఉచితంగా అందించే దిశగా చర్యలు చేపట్టింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల పేరుతో మినీ హబ్‌లను ఏర్పాటు చేసి విజయవంతంగా రక్త, మూత్ర పరీక్షలకు సంబంధించిన 57 రకాల టెస్టులను ఉచితంగా అందిస్తున్నారు. మరింత విలువైన సీటీ స్కాన్ కూడా కోటిన్నర రూపాయలతో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అందించే దిశగా చర్యలు చేపట్టారు. సీటీ స్కాన్‌తోపాటు డిజిటల్ ఎక్స్‌రేను కూడా ఏర్పాటు చేశారు. వీటితో సుమారు 90శాతం పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా అందనున్నాయి. దీంతో వ్యాధి నిర్ధారణకు ముందు చేయాల్సిన పరీక్షలను అందరికీ చేరువ చేసేందుకు పనులు చకచకా జరిగిపోతున్నాయి.
కోటిన్నరతో సీటీ స్కాన్ ఏర్పాటు..
జిల్లా జనరల్ ఆసుపత్రి కాస్త మెడికల్ కళాశాలగా మారడంతో జిల్లా ప్రజలకు వైద్యసేవలు మరింత సులభతరం అయ్యాయి. అనేక రకాల రోగాలను గుర్తించే పరీక్షలు కూడా ఉచితంగా అందిస్తున్నారు. జిల్లా జనరల్ అసుపత్రిలో సుమారు కోటిన్నర రూపాయలతో సీటీ స్కాన్ ఏర్పాటు చేయగా, దాని ద్వారా సుమారు 7వేల రూపాయల వరకు కలిగిన పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. అదేవిధంగా రూ.15 లక్షలతో డిజిటల్ ఎక్స్‌రే కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు క్యాజువాలిటీని కూడా జిల్లా అసుపత్రి నిధులతో ఆధునీకరించారు.
సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే పనులు పూర్తి
జిల్లా జనరల్ ఆసుపత్రిలో సుమారు కోటిన్నర రూపాయలతో సీటీ స్కాన్‌ను, రూ.15 లక్షలతో డిజిటల్ ఎక్స్‌రేను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు క్యాజువాలిటీని కూడా ఆధునీకరించాం. మరో రెండు, మూడ్రోజుల్లో అన్ని రకాల పనులు పూర్తి చేసి ప్రారంభిస్తాం. ఇప్పటికే సుమారు 57 రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తున్నాం. సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే వల్ల వేల రూపాయల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు ఉచితంగా అందనున్నాయి.