
సాగర్ ఎడమ కాల్వ కింద జోరుగా నాట్లు
50 శాతం పూర్తి
మరో 20 రోజుల్లో పూర్తిస్థాయిలో..
కూలీల కొరతతో కొంత ఆలస్యం
ప్రత్యామ్నాయ పద్ధతులపైనా పెరిగిన ఆసక్తి
సాగర్ ఎడమ కాల్వ కింద జోరుగా నాట్లు
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద వరి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు పొలం దమ్ములు, మరోవైపు నాట్లు చకచకా అయిపోతున్నాయి. బోర్లు, బావుల ఆధారం ఉన్న రైతులు నీటి విడుదలకు ముందే నారు పోసుకుని సిద్ధం చేసుకోవడం, ఆపై ప్రభుత్వం సరైన సమయంలో నీళ్లివ్వడం రైతాంగానికి కలిసి వచ్చింది. సాగర్ ప్రాజెక్టు కింద నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 3.75 లక్షల ఎకరాలు ఉండగా, ఇప్పటికే లక్షా 90 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. కూలీల కొరత ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో మరో 20 రోజుల్లో నూరు శాతం పూర్తికానున్నాయి. మరోవైపు గత వానకాలంతో పోల్చితే పాతిక శాతానికిపైగా డ్రమ్ సీడర్, సీడ్ డ్రిల్, వెదజల్లు పద్ధతిలో వరి సాగవుతున్నది.
మిర్యాలగూడ, ఆగస్టు 20 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు వానకాలం నీటి విడుదల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 4 నుంచి నవంబర్ 25 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఏడు విడుతలుగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఆయకట్టు రైతులు వరిసాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని, నార్లు పోసి సిద్ధం చేసుకోగా ఇటీవల కురిసిన ముసురుతో వరినాట్లు ఊపందుకున్నాయి. ఆయకట్టులో ఇప్పటి వరకు 50 శాతానికి పైగా వరి నాట్లు పూర్తి చేశారు. మరో 20 రోజుల్లో వానకాలం నాట్లు పూర్తి కానున్నాయి.
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల
రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. ఈ పద్ధతి వల్ల ఆయకట్టులో నీరు పొదుపు కావడం వల్ల చివరి భూములకు సైతం చేరుతున్నది. ఆరుతడి పద్ధతిలో వరిసాగు వల్ల అధిక దిగుబడి రావడంతో పాటు చీడపీడల తాకిడి తగ్గిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కాల్వ చివరి భూములకు సైతం సాగు నీరు అందుతుండంతో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రారంభం కాగానే ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నది. ఈ సంవత్సరం వానకాలం సాగుకు ఈ నెల 4 నుంచి నవంబరు 25 వరకు ఆన్అండ్ ఆఫ్ పద్ధతిలో ఏడు విడుతలుగా నీటిని విడుదల చేయనున్నారు.
50 శాతం వరినాట్లు పూర్తి
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు కింద ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 1.90 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఆయకట్టు రైతులు బోరుబావులు, ఊటబావుల కింద ముందస్తుగానే నారు పోసుకోవడంతో నాట్లు త్వరగా పూర్తయ్యాయి. మరో 20 రోజుల్లో కాల్వ చివరి భూముల రైతులు సైతం వరినాట్లు పూర్తి చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆరుతడితో దిగుబడి పెరిగింది
ఆరుతడి విధానం వల్ల పంటలు బాగా పండి మంచి దిగుబడి వస్తున్నది. ఏడేళ్ల నుంచి ఇదే విధానంలో సాగు నీటిని విడుదల చేస్తున్నారు. మేము కూడా దీనికి అలవాటు పడ్డాం. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి వల్ల సాగు నీరు కూడా అందరికీ అందుతున్నది. పంట పూర్తిస్థాయిలో పండే వరకు నీరు అందుతుండడంతో మా చింత తీరింది.
రైతులు నీటిని పొదుపుగా వాడాలి
సాగర్ ఎడమకాల్వ ఆయకట్టులో వరినాట్లు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి. కాల్వ చివరి భూములకు నీరు అందే విధంగా రైతులు సహకరించాలి. ఆన్ అండ్ ఆఫ్ విధానం వల్ల దిగుబడి బాగా వస్తుంది. ఆయకట్టులో నీటి సమస్య ఉంటే రైతులు వారి పరిధిలోని ఎన్ఎస్పీ అధికారుల దృష్టికి తీసుకురావాలి.