
దేవరకొండ గిరిజన గూడేలకు
194 ట్రాన్స్ఫార్మర్లు, మూడో లైను
ఉన్నచోటే ఆర్థిక పురోభివృద్ధికి దోహదం
నెలాఖరులోగా పూర్తికి సర్కారు ఆదేశం
అభివృద్ధికి దూరంగా విసిరేయబడి దశాబ్దాల తరబడి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తండాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. చిన్న పరిశ్రమలతో ఉన్నచోటే ఉపాధి కల్పించేందుకు వీలుగా ప్రతి తండాకూ త్రీ ఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పిస్తున్నది. ఆ మేరకు దేవరకొండ నియోజకవర్గంలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తుండడంతోపాటు 194 ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసింది.
దేవరకొండ, ఆగస్టు 20 : తండాల్లో 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు, లోఓల్టేజీ సమస్యను పరిష్కరించడానికి త్రీఫేజ్ కరెంటు సరఫరాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి ప్రతి తండాలోనూ ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేసి రెండు లేదా మూడు 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నది. సబ్‌ప్లాన్ నిధులతో ఇప్పటికే నియో జకవర్గానికి 194 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. వీటిని దేవరకొండ మండలానికి 62, చందంపేట 59, కొండమల్లేపల్లి 31, డిండి 21, పెద్దఅడిశర్లపల్లి 15, నాంపల్లి 6 మండలాలకు కేటాయించింది. అంతేకాకుండా గిరిజనులు పిండి గిర్నీ, చిన్న రైస్ మిల్లులు, కారం మిషన్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సబ్‌ప్లాన్ నుంచి నిధులను కేటా యించింది.
ఈనెల 31లోపు విద్యుత్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు 100శాతం ప్రభుత్వమే భరిస్తున్నది. మరో వారంలో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసేందుకు సిమెంటు దిమ్మెలను నిర్మిస్తున్నారు.
ఈ నెలాఖరుకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తాం
తండాల్లో 24 గంటలు విద్యుత్ ఉండేలా నియో జకర్గానికి సబ్ ప్లాన్ నిధుల కింద ప్రభుత్వం 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 194 మంజూరు చేసింది. ఈ నెలాఖరుకు తండాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేస్తాం. ఇప్పటికే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సా మగ్రి తండాలకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ దిమ్మెలు పూర్తి చేశాం
-రుక్మారెడ్డి, విద్యుత్ డీఈ