హాలియా, జనవరి 13 : పరిచయం అవసరం లేని నాయకుడు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య. అణగారిన వర్గాల హక్కుల కోసం, వృత్తిదారుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో వాణి వినిపించారు. స్వరాష్ట్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 35 ఏండ్లుగా కుందూరు జానారెడ్డి నిర్మించుకున్న కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టి గులాబీ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యేగా అనతి కాలంలోనే నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారు. ఆయన మృతి చెంది ఏడాదవుతున్నా నేటికీ ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారు. ఆయన తనయుడు ఎమ్మెల్యే నోముల భగత్ తండ్రి చూపిన బాటలో నడుస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
798 కుటుంబాల్లో వెలుగులు
సంక్రాంతి పండుగ వేళ ఎమ్మెల్యే నోముల భగత్ నియోజకవర్గంలోని 798 పేద కుటుంబాల్లో వెలుగులు నింపారు. తండ్రి జయంతిని పురస్కరించుకొని నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న హాలియాలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. 2వేల మంది యువతీ, యువకులు హాజరు 34 ప్రైవేట్ కంపెనీలు 798 మందిని ఎంపిక చేసుకొని మరుసటి రోజే ఉద్యోగాల్లో చేర్చుకున్నాయి. కొన్ని కంపెనీలు మరి కొందరిని ఎంపిక చేసుకొని మొదటి దఫా ఇంటర్వ్యూలు నిర్వహించి రెండో దశకు ఎంపిక చేశాయి. ఉద్యోగం పొందిన వారి కుటుంబాల్లో పండుగ వేళ ఆనందం వెల్లివిరుస్తున్నది.
2021లోనూ జాబ్‌మేళా..
2018లో నోముల నర్సింహయ్య నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలుపొందాక నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహించాలని నిర్ణయించారు. కానీ.. అనారోగ్య కారణాలతో 2020 డిసెంబర్ 1న నర్సింహయ్య మృతి చెందారు. ఆ తర్వాత ఆయన తనయుడు భగత్ 2021 మార్చిలో మెగా జాబ్‌మేళా నిర్వహించి వివిధ కంపెనీల్లో వంద మందికి పైకి యువతకు ఉగ్యోగావకాశాలు కల్పించారు.
నాన్నతోపాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాకు స్ఫూర్తి
మా నాన్నతోపాటు సీఎం కేసీఆర్, మంత్రి రామన్న నాకు స్ఫూర్తి. మా నాన్న నాకు జీవిత మార్గం చూపించారు. కేసీఆర్, కేటీఆర్ రాష్ర్టానికి వేలాది పరిశ్రమలు తీసుకువచ్చి లక్షలాది మంది యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. వారి స్ఫూర్తితోనే హాలియాలో మేగా జాబ్‌మేళా ఏర్పాటు చేశా. 798 మందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉంది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ పెద్దల సహకారం, ఈ ప్రాంత నాయకుల తోడ్పాటుతో నియోజకవర్గంలో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తా. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా.
ఉద్యోగం వచ్చినందుకు ఆనందంగా ఉంది..
హాలియాలో ఈ నెల 7న నిర్వహించిన జాబ్‌మేళాకు హాజరయ్యా. నాకు ప్రీమియర్ హెల్త్‌కేర్ సొసైటీలో జాబ్ వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ వేళ ఎమ్మెల్యే నోముల భగతన్న మా కుటుంబంలో వెలుగులు నింపారు. కార్పొరేట్ కంపెనీలను హాలియాకు పిలిచి జాబ్‌మేళా నిర్వహించిన భగతన్నకు, టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటాం.