
నల్లగొండ జిల్లాలో 4,02,773 మందికి కరోనా టీకా
మొదటి డోసు 3,19,977 మందికి, రెండో డోసు 82,796మందికి…
అర్హులందరూ వ్యాక్సిన్ చేయించుకోవాలి : వైద్యులు
నీలగిరి, ఆగస్టు 12 : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్యశాఖ అధికారులు 44కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటివరకు తొలి, రెండో డోసు కలిపి 4,02,773 మందికి టీకాలు వేశారు. ముందుగా వైద్య సిబ్బంది, ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ వేసుకోగా మూడో దశలో 60ఏండ్లకు పైబడిన, 45ఏండ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు టీకాలు వేశారు. ప్రస్తుతం 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ వ్యాక్సిన్ తీసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ రేటు ప్రస్తుతం 1.7శాతానికి తగ్గిపోయింది.
పకడ్బందీ చర్యలు
వ్యాక్సినేషన్‌పై వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. మొదటగా జనవరి 16న వ్యాక్సినేషన్‌ను మూడు కేంద్రాల్లో ప్రారంభించిన జిల్లా యంత్రాంగం దశలవారీగా 44కేంద్రాల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందిస్తున్నది. తొలి రోజుల్లో సరైన స్పందన లేకపోవడంతో అధికారులు వ్యాక్సినేషన్‌పై విస్తృతంగా ప్రచారం చేశారు. రెండో దశ విజృంభించడంతో వ్యాక్సిన్ కోసం ప్రజలు పోటెత్తారు. పీహెచ్సీ, యూహెచ్‌సీ, ప్రధాన వైద్యశాలల ఎదుట బారులు దీరారు. కొవాగ్జిన్ మొదటి డోసు తీసుకున్న వారికి 28రోజుల అనంతరం, కొవిషీల్డ్ తీసుకున్న వారికి 80రోజుల తరువాత రెండో డోసు ఇస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కొవిన్ యాప్‌లో సూచించిన తేది, సమయం ప్రకారం సమీప దవాఖానలకు వెళ్లి టీకా తీసుకుంటున్నారు.
పాజిటివ్ రేటు 1.7శాతం
జిల్లాలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. ఆంధ్రాకు సమీపంలో ఉండడంతో మే నెలలో లాక్‌డౌన్‌కు ముందు 30-35వరకు పాజిటివ్ శాతం నమోదైంది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించి పలు ఆంక్షలు అమలు చేయడంతో పాజిటివిటీ 8.5శాతానికి తగ్గిపోయింది. సాగర్, పెద్దవూర, పీహెచ్‌సీల పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదయ్యాయి. జూలై నెలలో రాష్ట్ర సగటు 2శాతం కాగా, జిల్లాలో 2.5గా నమోదైంది. దీనిపై వైద్యారోగ్యశాఖ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించగా జ్వర సర్వే ద్వారా కేసులు నియంత్రించగలిగారు. ఇప్పటి వరకు 8,62,525 టెస్టులు (8,24,652 ర్యాపిడ్, 37,873 ఆర్టీపీసీఆర్) చేయగా 69,873(64,373 ర్యాపిడ్, 5,500 ఆర్టీపీసీఆర్) పాజిటివ్ కేసులు వచ్చాయి. జిల్లాలో సగం జనాభాకు కరోనా పరీక్షలు పూర్తి చేయడం గమనార్హం. పాజిటివ్ శాతం 8.10శాతం ఉండగా యాక్టివ్ కేసుల శాతం 1.7గా నమోదైంది. ప్రస్తుతం 1,198 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 1,059మంది హోం ఐసొలేషన్‌లో, 139మంది దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా జిల్లాలో 327మంది మృతిచెందారు.
వ్యాక్సిన్ తప్పని సరిగా తీసుకోవాలి…
వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా వేయించుకోవాలి. స్మార్ట్‌ఫోన్ ద్వారా కొవిన్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకుని కేంద్రానికి వెళ్తే సిబ్బంది పరిశీలించి టీకా ఇస్తారు. జిల్లాలో ఇప్పటివరకు 4లక్షల మందికిపైగా టీకాలు వేశాం.
వ్యాక్సినేషన్ వివరాలు
కేటగిరీ మొదటి డోసు రెండో డోసు మొత్తం
హెల్త్‌కేర్ వర్కర్లు 9,299 7,965 17,264
ఫ్రంట్‌లైన్ వర్కర్లు 9,304 3,427 12,731
45-59 ఏండ్ల వారు 1,17,293 41,240 1,58,533
60సం. పైబడిన వారు 44,546 17,881 62,427
18-44 ఏండ్ల వారు 1,39,535 12,283 1,51,818
మొత్తం 3,19,977 82,796 4,02,773