
పాలకవీడు, సెప్టెంబర్ 11 : జాన్‌పహాడ్ దర్గా సైదులు బాబా దర్శనానికి వెళ్లి వస్తున్న ముగ్గురిని అతివేగంతో వచ్చిన లారీ బలి తీసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలను ఎదురుగా ఢీకొట్టడంతో భార్యాభర్తలు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గా గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ సమీపంలోని జంకుతండాకు చెందిన ధనావత్ పుణ్య(55), ధనావత్ మగ్తి(50) దంపతులు, మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంటకు చెందిన సయ్యద్ జానీ (36) శుక్రవారం వేర్వేరుగా ద్విచక్ర వాహనాలపై జాన్‌పహాడ్ దర్గా సైదులు బాబా సమాధుల దర్శనం కోసం వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి దామరచర్ల మీదుగా వారి స్వస్థలాలకు వెళ్తుండగా దామరచర ్లనుంచి జాన్‌పహాడ్‌కు వెళ్తున్న లారీ జాన్‌పహాడ్ దర్గా శివారులో అతి వేగంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ధనావత్ పుణ్య, సయ్యద్ జానీ ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో సయ్యద్ జానీ, ధనావత్ పుణ్య, అతని భార్య మగ్తి అక్కడికక్కడే మృతి చెందారు. శరీర భాగాలు ఛిద్రమై లారీ టైర్ కింది భాగంలో ఇరుక్కుపోయాయి. విషయం తెలుసుకున్న హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం తీరును పరిశీలించి లారీ కింద ఇరుక్కున్న మృతదేహాలను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ తప్పించుకుపోయాడు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం విషయాన్ని పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
దామరచర్ల, సెప్టెంబర్ 11 : మండలంలోని తాళ్లవీరప్పగూడెం యాదాద్రి పవర్‌ప్లాంట్ వద్ద శుక్రవారం రాత్రి బైక్‌ను టిప్పర్ ఢీకొన్న ఘటనలో గ్రామానికి చెందిన రాయికింది సైదులు (35) మృతి చెందాడు. వాడపల్లి ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన సైదులు, తన బావమరిది హుస్సేన్‌తో కలిసి బైక్‌పై గ్రామానికి వస్తుండగా.. ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం మిర్యాలగూడ దవాఖానకు తరలించారు. సైదులు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ విజయకుమార్ తెలిపారు.
బొలెరో ఢీకొని మహిళ..
చింతలపాలెం : మండలంలోని మేళ్లచెర్వు రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన యరబోలు రాధమ్మ(48) ఉద యం పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం పనులు ముగించుకొని కుమారుడు నర్సింహారెడ్డితో కలిసి టీవీఎస్ ఎక్సెల్‌పై ఇంటికి వస్తున్న క్రమంలో బొలెరో వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలై రాధమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు.
ముగ్గురికి గాయాలు
ఆత్మకూర్(ఎస్) : మండలంలోని పాతర్లపహాడ్ స్టేజీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన పసుల అశోక్, జి.కొత్తపల్లికి చెందిన పులిగిళ్ల లింగయ్య, నరేశ్ బైక్‌పై సూర్యాపేట నుంచి ఎర్రపహాడ్‌కు వస్తూ పాతర్లపహాడ్ స్టేజీ వద్ద కుడి వైపు నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్టారు. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట దవాఖానకు తరలించినట్లు ఏఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. రోడ్డుకు కుడివైపు ఆటోను నిలిపి ఉంచిన డ్రైవర్ ఉపేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
బైక్ ఢీకొని ఇద్దరికి..
దేవరకొండ : కొండమల్లేపల్లికి చెందిన యాదమ్మ మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ రోడ్డు పక్కన నిలబడి ఉండగా సాగర్‌వైపు వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో మహిళతో పాటు బైక్‌పై ఉన్న వ్యక్తికి సైతం గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
తిరుమలగిరి : మండలంలోని తొండ గ్రామానికి చెందిన పోతరాజు యాకయ్య(38) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా సూర్యాపేట ఏరి యా దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతు న్న అతను శుక్రవారం పరిస్థితి విషమించి మృతి చెం దాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ కృష్ణ తెలిపారు.