
హాలియా, ఆగస్టు 11 : సమైక్యాంధ్ర పాలకుల హయాంలో వెనుకబాటుకు గురైన నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే మూడుసార్లు పర్యటించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రూపకల్పన చేశారు. ఆ దిశగా ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఇటీవల నిర్వహించిన ప్రగతి సమీక్ష సమావేశంలో రూ.150కోట్లు కేటాయించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల భగత్‌కుమార్ గురువారం అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు. మే 2న ఫలితాల విడుదల మొదలుకొని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి పనులతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. కరోనా బాధితులను పలుకరించి ధైర్యం చెప్పారు. ఆపన్నుల ఆర్థిక సహకారానికి చొరవ చూపారు.
ఉప ఎన్నికల్లో గెలుపొందిన రెండో రోజు నుంచే నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే భగత్ దృష్టి సారించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల వారీగా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూశారు. దవాఖానల్లో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. జనం సమస్యల పరిష్కారం కోసం హాలియాలోని క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. తన దగ్గరికి వచ్చి విన్నవించుకున్న వారి సమస్యలను అప్పటికప్పుడు ఫోన్లో అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సహకారానికి తోడు ఉప ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్ఎస్ను ఆదరించారు. గడిచిన 100రోజుల్లో నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి పని చేయడం ఆనందంగా ఉంది. 40ఏండ్లుగా ఇక్కడ గెలుపొందిన నాయకులు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అందరి తోడ్పాటుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. నెల్లికల్లు లిఫ్ట్‌తోపాటు డిగ్రీ కళాశాల నిర్మాణం వేగంగా పూర్తి చేయిస్తా.