
రామగిరి, ఆగస్టు 11 : రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరిలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం ఆండాళ్ తిరునక్షత్రోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఆండాళ్ తల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో 108 కలశాలతో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అర్చక స్వాములు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో సాగిన వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శతఘటాభిషేకం మహారాజభోగం, ఆరగింపు మంగళాశాసనం చేశారు. ఉదయం చిన్నజీయర్‌స్వామి ఆండాళ్ అమ్మవారు, శ్రీరామానుజల వారి చరిత్రతోపాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేందర్‌కుమార్ తులసీనగర్ భక్తాంజనేయస్వామి దేవస్థానం మేనేజర్ రుద్ర వెంకటేశంతో కలిసి జీయర్‌స్వామికి బట్టలు, పండ్లు, పుష్పాలు అందజేశారు. తిరునక్షత్రోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చిన్నజీయర్‌స్వామి ద్వారా తీర్థగోష్టిని స్వీకరించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి దంపతులు, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.