
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలువైకుంఠధామం, డంపింగ్ యార్డులతో తీరిన సమస్యలుసుందరంగా సీసీ రోడ్లు.. ప్రకృతి వనంచివ్వెంల మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఒకప్పుడు అభివృద్ధి అంటే తెలియదు.. వర్షం వస్తే ఏ వీధిలో చూసినా బురద గుంతలే దర్శనమిచ్చేవి. రోడ్లపై పారుతున్న మురుగు, చెత్తాచెదారంతో గ్రామస్తులు వ్యాధుల బారిన పడే వారు. అంతిమ సంస్కారాలు చేయాలంటే ఊరు శివారులో ఉన్న చెరువు వద్దకు వెళ్లాల్సిందే. వర్షాకాలంలో దహన సంస్కారాలకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం ఆ గ్రామ స్వరూపం పూర్తిగా మారిపోయింది. రోడ్లు, వీధులు సీసీగా మారాయి. సకల సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మించారు.
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామ శివారులో ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలతో ఎకరం పది గుంటల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 26రకాలకు చెందిన 4వేల మొక్కలు నాటారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు నర్సరీ ఏర్పాటు చేసి 16,100 మొక్కలు పెంచారు. 7వ విడుత హరితహారంలో భాగంగా 5,500 మొక్కలు నాటారు. తడి,పొడి చెత్త సేకరణకు ట్రాక్టర్ కొనుగోలు చేశారు. రోజూ చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సేంద్రియ ఎరువు తయారీకి రూ 2.20 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డును నిర్మించారు.
గతంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన వసతులు లేకుండే. పల్లె ప్రగతిలో భాగంగా రూ.11 లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించడంతో ప్రజలకు చివరి మజిలీ కష్టాలు తప్పాయి. బర్నింగ్ ప్లాట్ఫాం, స్నానాల గదులు నిర్మించి నీటి వసతి కల్పించారు.
గతంలో తాగు నీటి కోసం గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడేవారు. వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకునేవారు. ఇప్పుడు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తుండడంతో ఆ సమస్య తీరింది.
గ్రామంలో 2,120 మంది జనాభా, 945 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 80 శాతం ఇంటి పన్నులు రూ1.75 లక్షలు వసూలు చేశారు. గ్రామంలో రూ.10 లక్షతో సీసీ రోడ్లు, రూ. 2లక్షలతో డ్రైనేజీ తదితర పనులు పూర్తి చేశారు. విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేపట్టి వీధిలైట్లు వేశారు.
ప్రభుత్వం సూచించిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నాం. పల్లె ప్రగతితో గ్రామంలో సమస్యలన్నీ తొలగి పోయాయి. అభివృద్ధిలో గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు.
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రోజూ పంచాయతీ సిబ్బందితో వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్నాం. ఇంటింటికీ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసి సంరక్షిస్తున్నాం.