
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిప్పులు చెరుగుతున్నాయి. పెట్రోల్ ఎప్పుడో సెంచరీ దాటగా, శనివారం నల్లగొండలో లీటర్ డీజిల్ రూ.100.87 గరిష్ఠ ధరకు చేరింది. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.969.50 అయ్యింది. ఏడాది కాలంలో 303 రూపాయలు పెరిగింది. ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడి రవాణా అయ్యే అన్ని రకాల వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఫలితంగా అన్ని వర్గాల ప్రజల బడ్జెట్ అతలాకుతలం అవుతున్నది. తెలంగాణకు పెద్ద పండుగ అయిన దసరా పూట ఈ ‘ధరా’ఘాతం మరింత ఇబ్బందిగా మారింది. సరుకుల చిట్టి చిన్నబోతున్నది. పట్టణాల నుంచి సొంతూళ్లకు ప్రయాణం భారంగా మారుతున్నది. కేంద్ర సర్కారు తీరుపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
పండక్కి కట్టెల పొయ్యే..
పోయిన నెల గ్యాస్ ధర 958 ఉంది. ఈ నెల గ్యాస్ బండ తీసుకుందామంటే 973 రూపాయలు ఇయ్యమంటున్నరు. పొయినేడాది ఆరొందలకు అటూ ఇటు ఉండే. ఏడాదిల్నే ఇంత ఘనం ధరలు పెంచుడేంది? ప్రతి నెలా ధరలు పెరుగుతుంటే గ్యాస్ అంటేనే భయమైతుంది. పండుగకు కట్టెల పొయ్యి పెట్టాల్సిందే. గ్యాస్ పొయ్యి మీద వంట చేసుకునే రోజులు కావియ్యి.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ) : కేంద్రంలో మోదీ సర్కారు విధానాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. రోజురోజుకూ ధరలు పెరుగడం తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా పెట్రో ధరలకు అడ్డుకట్ట పడడం లేదు. బంకులకు వెళ్తే తప్ప పెరిగిన ధరలు అర్థం కాని పరిస్థితి నెలకొంది. జూన్ మొదట్లోనే పెట్రోల్ ధర సెంచరీ దాటగా తాజాగా డీజిల్ ధర సైతం రూ.100.87కు చేరింది. లీటర్ పెట్రోల్ రూ.108.27గా ఉన్నది. పవర్ పెట్రోల్ మరో ఐదారు రూపాయలు అదనంగా పలుకుతున్నది. ధరల పెరుగుదలను గమనిస్తే ఇప్పట్లో అడ్డుకట్ట పడేనా..? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా, లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్య తరగతి జనం పెరుగుతున్న ధరలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
డీజిల్‌పై ఆరు నెలల్లో రూ.13.40 పెంపు…
డీజిల్ ధర పెరుగుదల అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తుంది. కేవలం ఆరు నెలల్లోనే లీటర్ డీజిల్‌పై రూ.13.40 ధర పెరిగింది. ఈ ఏడాది మార్చిలో లీటర్ డీజిల్ 87.47రూపాయలు కాగా, ప్రస్తుతం రూ.100.87కు చేరింది. గతేడాది మార్చిలో డీజిల్ ధర రూ.67.71, ఏడాదిన్నరలో రూ.33.16పెరిగింది. ఈ నెలలో తొమ్మిది రోజుల్లోనే ఆరు సార్లు డీజిల్ ధర పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. పెట్రోల్ ధర గతేడాది రూ.63కాగా, ప్రస్తుతం రూ.108.27చేరింది. 16 నెలల్లో రూ.46 పెరుగుదల కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 365 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా వీటి ద్వారా నిత్యం వేలాది వాహనాలు లక్షల లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తున్నాయి. పౌర సరఫరాల విభాగం లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో రోజూ 7.87 లక్షల లీటర్ల పెట్రోల్, 12.05 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. గతేడాది ధరలతో పోలిస్తే ప్రస్తుతం ఒక్కో నెల డీజిల్‌పై రూ.119.70కోట్లు, పెట్రోల్‌పై రూ.108 కోట్ల అదనపు భారం జిల్లా వినియోగదారులు భరిస్తున్నారు.
భగ్గుమంటున్న వంట గ్యాస్
వంటగ్యాస్ సిలిండర్ ధర దూకుడు గమనిస్తే అతి తొందరలోనే వెయ్యి మార్క్‌ను దాటేలా కనిపిస్తున్నది. తాజాగా ఈ నెల 6న ధర ఒకేసారి రూ.15 పెరిగింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.969.50ఉన్నది. ఇది కూడా స్వేచ్ఛా మార్కెట్ సాకుతో అంతకంతకూ పెరుగుతున్నది. ఫలితంగా సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీ నగదు కనుమరుగైపోతున్నది. గతేడాది ఇదే సమయంలో సిలిండర్ ధర రూ.663.50మాత్రమే. ప్రస్తుత ధరతో పోలిస్తే రూ.306 పెరిగింది. ఏడాది కాలంలో ఎనిమిది సార్లు గ్యాస్ ధరలు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 9.69లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో నల్లగొండ 4.15లక్షలు, సూర్యాపేట 3.24లక్షలు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2.29లక్షల వినియోగదారులు ఉన్నారు. ఇందులో ప్రతి నెలా మూడో వంతు సిలిండర్లు రీఫిల్ అవుతాయని అంచనా. సుమారు మూడు లక్షల సిలిండర్లను లెక్కలోకి తీసుకున్నా ఈ నెలలో పెరిగిన రూ.15 లెక్కిస్తే నెలకు రూ.45లక్షల అదనపు భారం పడుతుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సబ్సిడీని కేంద్రం పెంచడం లేదు. దాంతో వినియోగదారులకు అందాల్సిన సబ్సిడీ జీరోకు చేరింది. సాధారణంగా పెరిగిన ధరలో 75శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది.
నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావం..
గతేడాది మార్చిలో లాక్డౌన్ ప్రారంభం కాగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దానికి తోడు అడ్డూ అదుపూ లేని పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తున్నాయి. వస్తు రవాణాలో కీలకమైన ట్రాన్స్పోర్ట్ రంగాన్ని పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు, ఇతర అన్నిరకాల సామగ్రి ధరలు కూడా పెరుగుతున్నాయి. నిత్యావసరాల వస్తువుల ధరల్లో రూ.20 నుంచి రూ.80 వరకు సగటు పెరుగుదల కనిపిస్తున్నది. ధరల మోత దసరా పండుగ సంబురానికి పేదలను దూరం చేస్తుందనడంలో సందేహం లేదు.
ఆర్టీసీకి గడ్డుకాలం…
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను గట్టెక్కించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంటే.. పెరుగుతున్న డీజిల్ ధరలు గుదిబండగా మారుతున్నాయి. నల్లగొండ రీజియన్‌లో ఏడు డిపోల్లో 700 పైగా బస్సులు రోజువారీగా 60వేల లీటర్ల డీజిల్ వినియోగంతో 3.30 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంటాయి. ఈ నెలలో లీటర్ డీజిల్‌పై పెరిగిన రూ.1.94 ధరతోనే రోజూ అదనంగా రూ.1.16 లక్షల భారం పడుతున్నది. డీజిల్ ధరలు సంస్థ మనుగడను తీవ్రంగా ప్రభావితంచేస్తున్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేంద్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నదని కార్మికులు మండిపడుతున్నారు.
ట్రాన్స్పోర్ట్ రంగం అతలాకుతలం…
రవాణా రంగంలో కీలకమైన లారీ యాజమాన్యాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ‘లారీలను రోడ్డుపై తిప్పితే మూడు లాభం… ఆపితే ఆరు లాభం’ అన్నట్లుగా పరిస్థితి తయారైందని యజమానులు వాపోతున్నారు. ఆటో, టాక్సీ, మినీ లారీ లాంటి వన్నీ సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యవసాయరంగంలోనూ పెట్రో ధరల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో సాగు ఖర్చుల్లో పెట్రో ధరలదే సింహభాగం కావడం గమనార్హం.
గ్యాస్ బండ 971అయ్యింది..
వంట గ్యాస్ సిలిండర్ల ధరను నిత్యం పెంచడంతో సామాన్య ప్రజలపై పెను భారం పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే సిలిండర్ మీద 15రూపాయలు పెంచడంతో బండ ధర 971 రూపాయలైంది. గ్యాస్ పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితులు లేవు. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచడం చాలా బాధాకరం.
పెట్రోల్ భారం భరించలేకపోతున్నాం…
రోజు రోజుకూ పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో బండి నడపలేకపోతున్నాం. మా గ్రామం నుంచి దేవరకొండకు పోవాలంటే లీటర్ పెట్రోల్ ఖర్చయితుంది. 100 రూపాయలకు లీటర్ పెట్రోల్ కూడా వస్తలేదు. ఏ చిన్న పని పడినా సరుకుల కోసం పట్టణానికి పోవాల్సి వస్తుంది. బస్సుల్లో పోదామంటే సమయానికి ఉండవు. భారమైనా భరించి బండిపైనే పోతున్నం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలకు అడ్డుకట్ట వేయాలి.
ధరల మోత..
ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు తట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. అసలే కరోనా కాలంలో అన్ని వర్గాల ర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారింది. ధరల పెరుగుదల గోరు చుట్టు మీద రోకలిపోటులా తయారైంది. ఏ వస్తువులు చూసినా భగ్గుమంటున్నాయి. ధరలు ఒక్కసారిగా పెరుగడంతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు.