
రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. రైతు కుటుంబాలకు అండగా నిలిచారు. రైతు ఏ కారణం చేత మరణించినా, ఆ కుటుంబం కుదేలవకుండా ఆర్థిక భరోసా అందిస్తున్న రైతు బీమాను మరో ఏడాది పొడిగించారు. మూడేండ్ల నుంచి అమలులో ఉన్న పథకాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 13 అర్ధరాత్రి వరకు అమలులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ పథకంలో ఉన్న రైతులతోపాటు ఈ నెల 3లోపు భూమి రిజిస్ట్రేషన్ అయిన రైతులకూ అవకాశం కల్పిస్తూ 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పాత జాబితాలో తప్పుల సవరణ కూడా చేపడుతున్నారు. గతేడాది నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 4,07,333 మంది రైతులకు ప్రీమియం చెల్లించగా, ప్రతి యేడు మాదిరిగానే ఈసారి కూడా కొత్త దరఖాస్తులతో సంఖ్య పెరుగ
నున్నది. కరోనా ఇబ్బందుల్లోనూ రైతుబీమా పొడిగింపుపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): గతంలో వ్యవసాయంలో అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటే రైతులకు పరిహారం చెల్లింపుల ఊసే ఉండేది కాదు. పైగా ఆత్మహత్యలను అపహాస్యం చేసేలా వ్యవహరించిన తీరు మరణించిన రైతు కుటుంబాలను మానసికంగా ఎంతో కుంగదీసేది. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కుటుంబాలకు అలాంటి పరిస్థితి ఉండొద్దని సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన బృహత్తర పథకమే రైతు బీమా. రైతులపై భారం పడకుండా మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కారణం ఏదైనా రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమా సొమ్మును అందజేసే విధంగా పథకాన్ని రూపొందించారు. 2018 ఆగస్టు 15న ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశాక వాటి ప్రకారం ఈ పథకానికి విధివిధానాలు ఖరారు చేశారు. భారతీయ జీవిత బీమా(ఎల్ఐసీ)సంస్థ ప్రకారం ఉండే నిబంధనల మేరకు 18 నిండి 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ప్రతి రైతూ ఈ పథకంలో అర్హులుగా ప్రకటించారు. 2018-19 తొలి ఏడాది ఒక్కో రైతుకు రూ. 2,271 ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం, 2019-20లో రూ.3,371, 2020-21 సంవత్సరానికి రూ.3470 ప్రీమియం చెల్లించింది. ఈ ఏడాది కూడా ప్రీమియం చెల్లింపునకు కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 14 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది.
వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన అనంతరం పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు మొత్తం 4.08 లక్షల మంది, సూర్యాపేట జిల్లాలో 2.45లక్షల మంది ఉన్నారు. వీరిలో నిబంధనల ప్రకారం రైతు బీమాకు అర్హులైన వారి వివరాలను సేకరించి ప్రభుత్వం జాబితాను రూపొందించింది. ఇందులో రైతుల పూర్తి చిరునామా, నామినీ వివరాలను సేకరించింది. అనంతరం 2018-19 సంవత్సరం నుంచి పథకాన్ని అమలులోకి తీసుకురాగా తొలి ఏడాది నల్లగొండ జిల్లాలో 2.24 లక్షల మంది రైతులు, సూర్యాపేట జిల్లాలో 1.27లక్షల మంది అర్హులైన వారిని గుర్తించింది. రెండో ఏడాది 2019-20 సంవత్సరంలో నల్లగొండ జిల్లాలో 2.55 లక్షల మంది, సూర్యాపేట జిల్లాలో 1.45 లక్షల మంది రైతులు బీమా పథకంలోకి వచ్చారు. 2020-21వ సంవత్సరంలో నల్లగొండ జిల్లాలో 2.61లక్షల మంది, సూర్యాపేట జిల్లాలో 1,45,934 మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. ప్రస్తుతం 2021-22 సంవత్సరానికి ఈ సంఖ్య మరింత పెరిగి రెండు జిల్లాల్లో కలిపి 4 లక్షల పైచిలుకు చేరనుందని అంచనా. ఈ నెల 3 వరకు భూమి రిజిస్ట్రేషన్ జరిగిన రైతులకు కూడా కొత్తగా అవకాశం కల్పిస్తూ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఈ పథకం మొదలైన నాటి నుంచి నేటి వరకు 5,624 మంది రైతుల కుటుంబాలకు రూ. 281.20 కోట్లు బీమా సొమ్ము అందించారు.
అర్హులైన రైతులంతా తమ సరైన వివరాలను నమోదు చేసుకోవాలని నల్లగొండ జిల్లా డీఏఓ శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాగా వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ పథకాన్ని చిత్తశుద్ధ్దితో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తుండడం పట్ల ఉమ్మడి జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు, రుణమాఫీని అమలు చేస్తూ తాజాగా బీమా పథకాన్ని కూడా మరో ఏడాదికి పొడగించడం పట్ల సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్నది.
ఈ పథకంలో ఇప్పటికే ఉన్న రైతులతో పాటు గతేడాది నుంచి కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం కల్పించారు. దీంతో పాటు ఈ నెల 3 నాటికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న రైతులకు కొత్త పాసుపుస్తకం రాకపోయినా దరఖాస్తులకు అవకాశం కల్పించారు. 14-08-1962 నుంచి 14-08-2003 మధ్యలో జన్మించిన వారంతా ఈ ఏడాది బీమా పరిధిలోకి రానున్నారు. ఆధార్‌కార్డు పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆయా మండలాల పరిధిలోని ఏఈఓలు దరఖాస్తులు స్వీకరించి ఎప్పటికప్పుడే ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఈ పథకంలో ఉన్న రైతులు కూడా మరోసారి తమ చిరునామా, నామినీ పేర్లు సరి చూసుకోవాలని సూచించింది. రైతుల పేర్లు, వారి నామినీ పేర్లు, బ్యాంకు అకౌంట్ వివరాలు, పట్టాదారు పాసుపుస్తకాల నంబర్లు, ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే బీమా చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉన్నది. అందువల్ల ఇప్పటికే ఈ పథకంలో ఉన్న రైతులు తమ వివరాలను సరిచూసుకునేందుకు.. కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించింది. ఈ నెల 12 వరకు పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉన్నది. ఈ నెల 14 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది.