
గ్రామీణ ఆర్థిక పరిపుష్టే సీఎం కేసీఆర్ సంకల్పం
సాగుకు అనుబంధంగా వృత్తిదారులకు చేయూత
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నకిరేకల్, భువనగిరి చెరువుల్లోకి చేప పిల్లల విడుదల
కట్టంగూర్(నకిరేకల్), సెప్టెంబర్ 8 : వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆయన నకిరేకల్ పెద్ద చెరువులో మత్స్యకారులకు ఉచితంగా అందించిన చేప పిల్లలను వదిలారు. అలాగే భువనగిరిలోని పెద్దచెరువులోనూ మంత్రి చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రభుత్వం హరిత విప్లవం మాదిరిగా నీలి విప్లవం చేపట్టిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సర్కారు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 60శాతం నిధులు కేటాయించిందని తెలిపారు. చేతి వృత్తులకు ప్రోత్సాహం కల్పిస్తూ, పాడి పరిశ్రమ, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తోడ్పడుతున్నట్లు చెప్పారు. ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులతో మత్స్యకార్మికులకు ఉపాధి లభించడంతోపాటు చేపల ఉత్పత్తిలో రాష్ట్ర ఆదాయం మెరుగుపడుతున్నదని చెప్పారు. మత్స్య కార్మికులు ప్రమాదవశాత్తు, సహజంగా మరణిస్తే ప్రభుత్వం రూ.6లక్షలు చెల్లిస్తుందని తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ మత్స్య కార్మికులకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను అందజేస్తున్నదని, వాటిని పెంచి ఆర్థికంగా ఎదగాలన్నారు. మత్స్య కార్మికులకు ప్రభుత్వం అందించే ఉచిత చేపపిల్లల పంపిణీ, వలలు, టూ వీలర్లు, అటోలు, మొబైల్ వాహనాలతోపాటు ఇతర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీఓ జగదీశ్వర్‌రెడ్డి, మత్స్య శాఖ జిల్లా అధికారి చరితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.