
నల్లగొండ ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/రామగిరి, అక్టోబర్ 7 : విద్యార్థులకు గుణాత్మకమైన విద్య అందించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సూచించారు. గురువారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి వచ్చిన ఆమె వర్సిటీ పాకలమండలి సమావేశం నిర్వహించారు. తొలుత వీసీ ప్రొ. గోపాల్‌రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధి, వసతులు, కొత్త భవనాల నిర్మాణాలు, బోధన, బోధనేతర సిబ్బంది, ఖాళీ పోస్టుల వివరాలు తెలియజేశారు. అనంతరం ఆమె పాలకమండలి సభ్యులు, ఇతరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అంశాలపై అవగాహన ఉందన్నారు. తాను వచ్చిన తర్వాతనే వీసీ నియామకం జరిగిందని, ఇప్పటికే పలు పర్యాయాలు వర్చువల్ సమావేశాల్లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేందుకు విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అవసరమని చెప్పారు. అన్ని యూనివర్సిటీల్లో నాణ్యమైన ఉన్నత విద్యను విద్యార్థులకు చేరువ చేయాలని సూచించారు. యూనివర్సిటీల సర్వతోముఖాభివృద్ధికి పూర్వ విద్యార్థుల మద్దతును పొందేందుకు గవర్నర్ ప్రారంభించిన ‘చాన్స్‌లర్ కనెక్ట్ అలుమినీ’ చొరవపై అవగాహనపరిచి అందుకు సబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ విష్ణుదేవ్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, చంద్రశేఖర్, ఎస్పీ రంగనాథ్, ఎంజీయూ మాజీ వీసీ ప్రొ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు ఆకుల రవి, శ్రీదేవి, కొప్పుల అంజిరెడ్డి, ఘన్‌శ్యాం, కృష్ణారెడ్డి, సోమ రమేశ్, కోటేశ్వర్రావు, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండ రెడ్‌క్రాస్ సేవలు అమోఘం
నీలగిరి : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితిలో రక్తసేకరణ, తలసేమియా ఆపరేషన్లు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో నల్లగొండ రెడ్‌క్రాస్ చేసిన సేవలు అమోఘమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. నల్లగొండలోని రెడ్‌క్రాస్ భవన్లో కొత్తగా నిర్మించిన సెమినార్ హాల్‌తోపాటు రూ.17.84లక్షలతో ఏర్పాటు చేసిన అంబులెన్స్, రక్త సేకరణ వాహనాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. రెడ్‌క్రాస్ చేసిన సేవల ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైన అత్యవసర సేవలను సమర్థవంతంగా అందించడంపై రెడ్‌క్రాస్‌ను అభినందించారు. కరోనా సమయంలో లక్ష మాస్కులతోపాటు ఆహారం, మంచినీరు, పౌష్టికాహారం పంచడం సంతోషకరమన్నారు. ఇదే సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు చేసిన సేవలను అభినందనీయమని, వారి సేవలకు సెల్యూట్ చెప్పారు. చారిత్రక నల్లగొండ జిల్లాకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. 1950లో ఏర్పాటు చేసిన నల్లగొండ సొసైటీ దక్షిణ భారతదేశంలోనే పురాతమైన బ్రాంచ్ అని, అందులో తన చేతుల మీదుగా సెమినార్ హాల్ ప్రారంభించడం తన అదృష్టమన్నారు. అనంతరం రెడ్‌క్రాస్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తూ కరోనాతో చనిపోయిన శ్రీనివాస్ కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందజేశారు. అనాథ పిల్లలకు దసరా పండుగ సందర్భంగా ఉచిత దుస్తులు, పారిశుధ్య కార్మికులకు హైజిన్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, ఇన్చార్జి కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ ఏవీ రంగనాథ్, అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, గర్నవర్ సెక్రటరీ కె.సురేంద్రమెహన్, రెడ్‌క్రాస్ సొసైటీ సీఈఓ మదన్మెహన్రావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, సభ్యులు సూరెడ్డి సరస్వతి, బుక్కా ఈశ్వరయ్య, కోటేశ్వర్రావు, జెల్లా దశరథ, ఉరుకొండ ప్రభాకర్‌రెడ్డి, వైద్యులు సుచరిత, వసంతకుమారి, రాజేశ్వరి పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ..
అంతకు ముందు వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన మహాత్ముడి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్, వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ సైన్స్ బ్లాక్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అదే బ్లాక్ ఎదుట మొక్క నాటారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి పటిష్ట బందోబస్తు చేపట్టారు. యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ సమావేశం మందిరం ఎదుట మహిళా అధ్యాపకులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఛాయా సోమేశ్వరాలయం సందర్శన
నల్లగొండ రూరల్, అక్టోబర్ 7 : నల్లగొండ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన గవర్నర్ తమిళిసై చారిత్రక ఆలయం పానగల్ ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ కమిటీ తరఫున అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి బిల్వార్చన, అభిషేకం చేశారు. చరిత్ర పరిశోధకుడు సూర్యకుమార్ ఆలయ విశిష్టతను గవర్నర్‌కు వివరించారు. ఆలయ పరిసరాల్లో మొక్క నాటారు. ఎస్పీ రంగనాథ్, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, వి.చంద్రశేఖర్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏడీ బుజ్జి, ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, గోనారెడ్డి పాల్గొన్నారు.