
దశాబ్దాల తరబడి నలుగుతున్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు ముగింపు పలుకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పోడు భూముల సాగులో ఉన్న గిరిజనులకు హక్కులు కల్పించేలా తాజాగా అసెంబ్లీలో కీలక
ప్రకటన చేయడం ఆ వర్గాల్లో సంతోషాన్ని నింపుతున్నది. త్వరలోనే పోడు భూములపై
గిరిజన రైతుల నుంచి ఎమ్మెల్యేలు దరఖాస్తులు స్వీకరించనుండగా.. అర్హులందరికీ ప్రభుత్వం పట్టాలను అందజేయనున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో ఉన్న పోడు భూముల వివాదానికి తెరపడనున్నది.
సంతోషంగా ఉంది
దాదాపు వందేండ్ల నుంచి మా కుటుంబం పోడు వ్యవసాయం చేస్తున్నది. పంటలు పండించుకుంటున్నం గానీ, పెట్టుబడికి బ్యాంకులో లోను తీసుకుందాంటే పాస్‌బుక్కులు లేవు. దాంతోని రైతుబంధు కూడా రాట్లే. సీఎం కేసీఆర్ సారు మా భూములకు పట్టాలిస్తమని చెప్పడం సంతోషంగా ఉన్నది.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తరతరాలుగా గిరిజనులు పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ.. వాటిపై నేటికీ హక్కులు మాత్రం పొందలేకపోతున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే వారికి ఏవిధమైన పరిహారం అందే పరిస్థితి లేకుండా పోతున్నది. దీనివల్ల ఏడాది పొడవునా పంటల సాగు కోసం వారు పడిన శ్రమ వృథా అవుతున్నది. ఇలా..అటవీ ప్రాంతాల్లోని భూములకు హక్కుల చిక్కులు తేలకుండా ఏండ్ల తరబడిగా సమస్య కొనసాగుతుండడంతో అటవీశాఖ, గిరిజనులకు మధ్య తరచూఘర్షణలు జరుగుతున్నాయి. 2006 సంవత్సరంలో ప్రభుత్వం కొంతమేర పోడు భూములకు అటవీ హక్కుల చట్టం(ఆర్ఓఎఫ్ఆర్)కింద పట్టాలు జారీ చేసింది. కొన్ని చోట్ల రెవెన్యూ శాఖ సైతం అసైన్డ్ భూములను కేటాయించి పట్టాలను జారీ చేసింది. మిగతా వారికి పట్టాలు ఇవ్వకున్నా పోడు భూముల్లో సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో గిరిజనేతరులు కూడా ఉన్నారు. అయితే హద్దులు తేలక.. చేతిలో పట్టాలు ఉన్నవారు సైతం సాగు చేసుకునే పరిస్థితి లేదు. ఏండ్ల తరబడిగా సాగు చేసుకుంటున్న భూముల వద్దకు వెళ్తే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉత్పన్నమవు తున్నా యి. రెవెన్యూ, అటవీశాఖల మధ్య హద్దులు తేలకపోవడంతో యేటా సీజన్ ఆరంభంలో పంటల సాగు సందర్భంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోడు భూముల వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
జిల్లాలో వెయ్యి ఎకరాల్లో పోడు భూములు
జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 11,788 హెక్టార్లలో అడవుల విస్తీర్ణం ఉండగా..సుమారు వెయ్యి ఎకరాల్లో రైతులు పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ, తుర్కపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో పోడు భూముల సమస్య ఉంది. దీంతో అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య తరుచుగా వివాదాలు ఏర్పడుతున్నాయి. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమి తమదేనంటూ అటవీశాఖ అధికారులు ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. దీంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా తాము భూములను సాగు చేసుకుంటున్నామని, ఆ భూములకు పూర్తి హక్కులు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యేటా పునరావృతమవుతున్న ఈ సమస్యతో సంబంధిత అధికారులు సైతం సతమతమవుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే పోడు భూముల లెక్కలను తేల్చేందుకు సిద్ధ్దపడడం..ఎమ్మెల్యేల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర ఎకరం, ఎకరం చేసుకునే అర్హులైన గిరిజనులందరికీ పట్టాలు ఇస్తామని ప్రకటించడంతో సంబంధిత రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అలాగే వందల ఎకరాల్లో భూములు కబ్జాచేసిన వారి తరిమేస్తామని సీఎం చేసిన ప్రకటన అక్రమార్కుల్లో దడ పుట్టిస్తున్నది
రైతు బంధు తో వెన్నుదన్ను పోడు భూముల్లో ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు రైతు బంధు సాయాన్ని అందిస్తూ సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రతి సీజన్లోనూ పెట్టుబడి సాయాన్ని అందిస్తుండగా.. జిల్లాలో గత రెండు సీజన్ల నుంచి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులకూ సాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం 168 మంది రైతులకు సంబంధించి 435 ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అందుతుండగా.. ఈ ఏడాది వానకాలం సీజన్‌కు మరికొంత మందికి రైతు బంధు సాయం అందించాలని సంకల్పించిన ప్రభుత్వం జూన్ 10 కటాఫ్ తేదీ పెట్టుకుని గుర్తింపు ప్రక్రియను చేపట్టడంతో మరింత మంది గిరిజన రైతులకూ సాయం అందింది. సీఎం కేసీఆర్ ఔదార్యంతో తీసుకున్న నిర్ణయంతో గిరిజన రైతుల కుటుంబాలు గొప్ప ఊరటను పొందాయి.
హక్కులు లేక ఇబ్బందులు పడుతున్నాం
నాకున్న రెండు ఎకరాలకు గతంలో పట్టాలిచ్చినరు. ఇవి గిప్పుడు చెల్లవ్వనంటున్నరు. తరతరాలుగా ఎవుసం చేసుకుంటున్న భూ ముల్లో మాకు హక్కే లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న పాసు పుస్తకాలను మాకు కూడా ఇచ్చి వారసత్వంగా వస్తున్న భూములపై హక్కులు కల్పించాలి.
-కొర్ర దేవా, ఐదుదోనాలతండా, సంస్థాన్‌నారాయణపురం మండలం